మధిర, మే 21 : మడుపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశవిద్యాలయo వారి సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణి దేవి మాట్లాడుతూ…. యూరియాను దఫ దఫాలుగా పంటకు వేసుకోవాలని, ఒకేసారి యూరియా వేసుకోవడం వల్ల పంటలకు అధిక చీడపీడలు ఆశించే అవకాశం ఉందన్నారు. అలాగే వరిలో ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జింక్ దుక్కిలో వేసుకోవాలని, వరి కోయల్ని కాల్చకుండా భూమిలో కలియ దున్నుకోవాలన్నారు. అంతేకాకుండా నూనె గింజలు, అపరాలు పెంచడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు.
మిర్చి, పత్తిలో లింగాకర్షణ బుట్టలు, పసుపు, నీలిరంగు అట్టలు పెట్టుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, అంతర పంటలుగా ఏ పంటలు వేసుకోవాలో చెప్పారు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలని రైతులకు సూచించారు. ఏఓ సాయి దీక్షిత్ మాట్లాడుతూ.. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, రసీదు తప్పక తీసుకోవాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, రకాలు వేసుకోవాలని అప్పుడే రైతులకి ఆదాయం పెరుగుతుందన్నారు. మండలంలో జిలుగు, జనుము సబ్సిడీ మీద ప్రభుత్వం ఇస్తుందని, వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మడుపల్లి ఏఈఓ అమృత, గ్రామ రైతులు పాల్గొన్నారు.