కారేపల్లి, అక్టోబర్ 09 : కారేపల్లి మండల పరిధిలోని రైతులు మండల కేంద్రంలోని సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయాలు జరుపుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో విక్రయాలు చేసుకోవాలని ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈ.నరేశ్‌కుమార్ అన్నారు. గురువారం కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో పలువురు రైతులకు సంబంధించిన పత్తి చేలను పరిశీలించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా క్వింటాకు రూ.8,110 ధర ప్రకటించిందని, తేమ శాతం లేకుండా పత్తిని కేంద్రాన్ని తీసుకొచ్చి విక్రయించుకోవచ్చన్నారు. నగదు చెల్లింపుల కోసం బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్ తో లింక్ అయ్యి ఉండాలన్నారు. రైతులు తీసుకొచ్చే పత్తి తేమ శాతం 12 శాతం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎన్.శ్రీనివాసరావు, సిబ్బంది రంజిత్, మున్నేరు, మధు, రవి, రైతులు పాల్గొన్నారు.