చండ్రుగొండ, మార్చి 28: వాగు నీటిని నమ్ముకుని ఏటా మాదిరిగానే రైతులు యాసంగి పంట సాగు చేశారు. పంట వేసే సమయంలో నీరున్నా.. పూర్తి వేసవి రాకమునుపే నెలరోజుల ముందే ఎదుళ్లవాగు ఎండిపోయింది. వాగును నమ్ముకొని పంట సాగు చేసిన చండ్రుగొండ మండల రైతులు కళ్లముందు ఎండిపోతున్న పంటను చూసి తల్లడిల్లుతున్నారు. భగీరథ ప్రయత్నం చేసినా పంటను కాపాడుకోలేని పరిస్థితి నెలకొన్నది.
చండ్రుగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు ఎదుళ్లవాగు ఆధారంగా తుంగారం, రేపల్లెవాడ, సత్యనారాయణపురం, గానుగపాడు, తిప్పనపల్లి, సీతాయిగూడెం, ఇమ్మడిరామయ్యబంజర, అయ్యన్నపాలెం, చండ్రుగొండ గ్రామాల్లోని సుమారు ఐదారువందల మంది రైతులు యాసంగి పంటలు పండిస్తున్నారు. 700 ఎకరాల మేర వరి పంట పండిస్తున్నారు. పదేళ్లపాటు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకున్నారు.
అయితే ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా వరి పొట్ట దశలో ఉండగానే వాగు ఎండిపోయింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు వాగులో జేసీబీలు, క్రేన్ల సాయంతో గుంతలు తవ్వించినా అవి కూడా పది రోజుల వ్యవధిలోనే ఎండిపోయాయి. ఇప్పటికే సుమారు 70 ఎకరాల్లో పంట ఎండిపోయింది. నీరు అందకపోతే మరికొద్ది రోజుల్లో ఇంకొన్ని ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వరి సాగు రైతులు వాపోతున్నారు.