చండ్రుగొండ, ఏప్రిల్ 30 : తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమను నిలుపు దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం లారీలకొద్దీ ఎగుమతికి సిద్ధంగా ఉన్నదని, అయినా మిల్లర్లు కొర్రీలు పెట్టడం వల్ల కాంటాలు సక్రమంగా జరగడం లేదన్నారు.
ధాన్యం ఆరబెట్టి తీసుకొస్తున్నా బస్తాకు 3 కేజీలు అదనంగా కాంటా వేయాలని, క్వింటా ధాన్యానికి 5 నుంచి 7 కేజీల వరకు అదనంగా కాంటా వేస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్ల దోపిడీ ఆపకపోతే మూకుమ్మడిగా రైతులందరం కలిసి రోడ్డెక్కుతామని హెచ్చరించారు.