వైరా టౌన్, నవంబర్ 16: కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు శనివారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. మార్కెట్లో వేబ్రిడ్జి ఉన్నప్పటికీ ప్రైవేటు వేబ్రిడ్జి వద్దకు పంపించి వ్యాపారులు మోసాలకు పాల్పడుతుండడాన్ని గ్రహించిన రైతులు తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. మార్కెట్లో ఉన్న కాంటాను వాడకుండా బయట వేబ్రిడ్జికు పంపడం ఏమిటని అక్కడే ఉన్న మార్కెట్ కార్యదర్శిని రైతులు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు.
తమను ఇంతగా మోసం చేస్తున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం, న్యాయం చేయాలని కోరుతూ రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కాంటాల్లో మోసాలను నివారించి.. వ్యాపారుల దగా నుంచి రక్షించాలని అధికారులను వేడుకున్నారు. రైతుల ఆందోళన వద్దకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.