ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం నిత్యం రోడ్డెక్కి నినదిస్తున్న అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సాగునే నమ్ముకున్న రైతుల కోసం మేమున్నాం అంటూ నడుం బిగించింది. ఆరుగాలం పంట పండించి అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్న రైతాంగానికి బాసటగా నిలిచింది. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కన్నెర్రజేసింది. వరి, మొక్కజొన్న పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడింది.
ఖమ్మం జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు పూనుకుంది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. ధాన్యం క్వింటాకు రూ.1,600, మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించింది. ఈ క్రమంలో ‘రైతు భరోసా ఎక్కడా.. కొనుగోలు కేంద్రాలు ఎక్కడా..’, ‘మక్క రైతులను ముంచొద్దు.. వరి రైతులకు ఉరి వేయొద్దు..’, ‘బోగస్ మాటలు కట్టిపెట్టు.. బోనస్ ఇచ్చి మాట నిలబెట్టుకో..’ వంటి ప్లకార్డులు చేబూని ధర్నా నిర్వహించారు.
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ ప్రధాన గేట్లను నెట్టుకొని వెళ్లి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ధర్నాకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షత వహించగా.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి,
డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఉప్పల వెంకటరమణ, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి, సీనియర్ న్యాయవాది బిచ్చాల తిరుమలరావు, నాయకులు గొల్లపూడి రాంప్రసాద్, చిలుమూరు కోటి, షకీనా, పద్మ, దానయ్య, పోట్ల శ్రీను, భుక్యా అశోక్, తుల్లూరి ప్రసాద్, పొట్లపల్లి రాజా, మాటేటి కిరణ్, తోడేటి లింగరాజు, కార్పొరేటర్లు, అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు, అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉంటే.. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో రైతులు రూ.1,600 దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఫలితంగా రూ.800 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వరి, మక్కలను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
నాటి సివిల్ సైప్లె శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్‌తో మాట్లాడి రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశారన్నారు. అనుభవం ఉన్నట్లు చెప్పుకునే మంత్రులు ఉత్తమకుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి భట్టి విక్రమార్క.. ఉన్నా జిల్లాలోని రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మెస్సీని పిలిచి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు పెట్టిన ఖర్చు కూడా జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అంత ఖర్చు కాదన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
రైతులు పండించిన పంట చేతికొచ్చి నెలరోజులైనా కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించుకోవాలనే సోయి ప్రభుత్వానికి లేకపోవడం బాధాకమైన విషయమని పేర్కొన్నారు. ఈ నెల 2న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే.. 24వ తేదీ వచ్చినా కొనుగోళ్లు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. జిల్లాలో 308 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెబుతున్న అధికారులు.. ఎక్కడెక్కడ కొనుగోళ్లు చేపట్టారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించకపోవడం వల్ల రైతులు రూ.2,400 ఉన్న మద్దతు ధర కాదని, దళారులను ఆశ్రయించి కేవలం రూ.1,600 అమ్ముకుంటున్నారని ఆవేదన చెందారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కల్లాల్లోనే పచ్చి వడ్లను అమ్ముకొని ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపోతున్నారన్నారు. ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగి కాంగ్రెస్ నేతలే పెత్తనం చెలాయిస్తూ వాళ్లు చెప్పిన వారికే బస్తాలను ఇస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే 70 శాతం పంటను రైతులు అమ్ముకున్నారని.. మిగిలిన 30 శాతం పంటలనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
-సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ధర్నాతో జిల్లాలోని ముగ్గురు మంత్రుల గుండెల్లో గుబులు మొదలైందని ఎద్దేవా చేశారు. ప్యాంట్లు సర్దుకునే పనిలో పడి.. అధికారులతో మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించి ఉడాయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రాలు ఏర్పాటు చేసినా బస్తాల్లేక, కొన్న ధాన్యాన్ని లోడు చేసేందుకు లారీల్లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని, మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై పోరుకు సంకల్పించారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకత్వం పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు కాంగ్రెస్ నేతలకే పనులు చేస్తున్నారని కొణిజర్ల మండలంలో కొందరు నేతలు ఫిర్యాదు చేశారని తెలిపారు. రైతుల కోసం పని చేయాల్సిన అధికారులు.. తోక జాడిస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారడం సహజమని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారులోకి వస్తే అధికారుల తోక కట్ చేయక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో యూరియా కోసం చెప్పులను క్యూలో పెట్టుకొని గంటలకొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు.
-తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రైతుల కష్టాలను నేరుగా చూసిన ఉద్యమ నేత కేసీఆర్ అని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా చేశాడని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలోనే మళ్లీ రాష్ర్టాన్ని ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దేడ్చిన వ్యవసాయం’గా తయారు చేశాడని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటను కొనలేని దీనస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధు డబ్బులు కేవలం పది రోజుల్లోనే ఖాతాల్లోకి జమయ్యేవని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా డబ్బులు అసలు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ఎత్తివేస్తుందేమోననే అనుమానాన్ని కందాల వ్యక్తం చేశారు.
-కందాల ఉపేందర్‌రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే
కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారని మండిపడ్డారు. ముగ్గురూ ఎవరి ఖజానా వారు నింపుకునే పనిలో ఉన్నారని ఎద్దేశా చేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే సోయి ముగ్గురు మంత్రుల్లో ఏ ఒక్కరికీ లేదన్నారు. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే మొక్కుబడిగా ప్రారంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్‌ను, బస్తాల్లో లోడ్ చేసే హమాలీలను రైతులే మేనేజ్ చేసుకొని పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి నేడు కేంద్రాల్లో కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా మంత్రులు మొద్దు నిద్ర వీడి రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని, లేదంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
– ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు
పదవుల కోసం పార్టీలు మారడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు 40 ఏళ్ల అనుభవం ఉందని మండిపడ్డారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒకరు కమీషన్ల కోసం, మరొకరు భూములను కబ్జా చేసేందుకు, ఇంకొకరు పర్సంటేజీల కోసం పనిచేస్తూ రాష్ర్టాన్ని ఆగం పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. జిల్లాకు వచ్చి అధికారులతో సమావేశాలు నిర్వహించి, తక్షణమే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ప్రధాన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపి రాష్ర్టాన్ని స్వర్ణయుగంగా తీర్చిదిద్దాడని గుర్తు చేశారు. పెట్టిన పొయ్యి.. వండిన అన్నాన్ని చేతికందిస్తే.. వడ్డించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని ఎద్దేవా చేశారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ రావాలంటే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. కరోనా సమయంలో ఒకే సీజన్లో 4 లక్షల టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పువ్వాడ గుర్తు చేశారు.
-పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి