చండ్రుగొండ, నవంబర్ 26 : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. దాదాపు 20 రోజులు గడిచినా బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. నిబంధనలు, తేమ శాతం అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక అవసరాల కోసం దళారులకు ధాన్యం విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. మండలంలోని మద్దుకూరు, దామరచర్ల, తిప్పనపల్లి, పోకలగూడెం, తుంగారం, రావికంపాడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 5వ తేదీన అధికారులు ప్రారంభించారు. గుంపెన, గానుగపాడు సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా.. కొనుగోళ్లు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని అధికారులు చెబుతున్నా.. కేంద్రాల్లో పెట్టే నిబంధనలతో రైతులు అటువైపు కూడా వెళ్లడం లేదు. దీనికి ప్రధాన కారణం.. తేమ శాతం 17 శాతం ఉండాలని, తూర్పార పట్టడం, ఆరబెట్టడం, గింజ నాణ్యత ప్రకారం ఉండటం, రైతులు పట్టదారు పాస్ పుస్తకం కలిగి ఉండటం వంటి నిబంధనలు పెడుతుండడంతో చేసేది లేక రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో కొనేలా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.
దామరచర్ల గ్రామంలో కనీస సౌకర్యాలు లేకుండా, బోర్డు, టెంటు లేకుండా అధ్వానంగా ఉన్న భూమిలో కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. ధాన్యాన్ని కుప్పలుగా పోసేందుకు, కాంటాలు వేసేందుకు కూడా అక్కడి భూమి చదునుగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదు. ఇక మద్దుకూరు గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని కొనుగోలు కేంద్రంగా మార్చారు. దీనిపై క్రీడాకారులు, యువకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు ఉపయోగంగా, సౌకర్యవంతంగా ఉండే ప్రదేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కాంటాలు ఆలస్యమవుతున్నాయి. త్వరలోనే ధాన్యం కాంటాలు ప్రారంభిస్తాం. ఎప్పటికప్పుడు రైతుల వద్దకు వెళ్తున్నాం. పలుచగా ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచిస్తున్నాం. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి.
-వినయ్, మండల వ్యవసాయాధికారి