కొత్తగూడెం అర్బన్, జూలై 27: యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా ఇద్దరు మంత్రులు ఆదివారం మాట్లాడిన మాటలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అత్యవసర కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో ఆదివారం మధాహ్నం 12 గంటలకు నిర్వహించిన సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఈ సమీక్షలో తొలుత డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు అందించేందుకు యూరియా కొతర లేదని స్పష్టం చేశారు. యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు. కానీ అంతకు ఒక గంట ముందే.. అంటే ఉదయం 11 గంటలకే ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిలతో కలిసి అదే కలెక్టరేట్లో మంత్రి తుమ్మల ప్రెస్మీట్ పెట్టారు. ఆ విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ర్టానికి తగినంత యూరియాను కేంద్రం వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తగినంత యూరియా పంపాలని అన్నారు.
ఆగస్టు నెల అవసరాలను తీర్చేందుకు రాష్ర్టానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాసినట్లు చెప్పారు. తెలంగాణలో వానకాలం పంటల సాగు ఉధృతంగా సాగుతున్న వేళ ఆగస్టులో యూరియా వినియోగం 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎరువుల శాఖ మంత్రికి లేఖ రాసి.. రాష్ర్టానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని కోరినట్లు చెప్పారు. జూన్, జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువగా ఉండడంతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ లేఖలో కేంద్రానికి వివరించామని స్పష్టం చేశారు.
అయితే.. యూరియా కోసం అన్నదాతలు అల్లాడుతున్నా, సహకార సంఘాల్లో యూరియా బస్తాల కోసం బారులు తీరుతున్నా, చివరికి చెప్పులు కూడా క్యూలో పెట్టి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా.. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వం వితండవాదం చేస్తూ వచ్చింది. యూరియా కొరత ఏమీ లేదంటూ అడ్డగోలుగా వాదిస్తూ వచ్చింది. యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు యుద్ధం చేస్తున్నా కొరతే లేదంటూ అబద్ధాలు చెప్పింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కలెక్టరేట్లోని ప్రెస్మీట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదివారం ఆదివారం చెప్పిన మాటలు.. రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతుండడం గమనార్హం. జూన్, జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ కేంద్రానికి లేఖ రాశామని చెప్పడంతో.. యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో అనే విషయం స్పష్టమవుతుండడం విశేషం.