టేకులపల్లి/పాల్వంచ/లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 1 : పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకొని వరుసలో నిలబడి అవస్థలు పడ్డారు. రోజులతరబడి తిరుగుతున్నా యూరియా దొరకకపోవడంతో టేకులపల్లి బస్టాండ్ సెంటర్లో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. స్టాక్ లేదని, లోడు రాలేదని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప యూరియా పంపిణీ చేయడం లేదని పలువురు రైతులు ఆరోపించారు.
రోజులుకొద్దీ తిరిగినా ఒక్క బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు. కాగా.. ధర్నా చేస్తున్న రైతులకు పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అలాగే పాల్వంచ సొసైటీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. సొసైటీ కార్యాలయానికి రోజూకు 200 నుంచి 250 బస్తాల యూరియా మాత్రమే వస్తుండడంతో గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ఆగస్టు 21న సీరియల్లో పెట్టిన రైతులకు మాత్రమే బస్తా చొప్పున యూరియా పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు గగ్గోలు పెట్టారు. లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులోని సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు పడిగాపులు కాశారు. చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి రైతులు గురువారం నుంచి యూరియా కోసం తిరుగుతున్నా రేపు మాపు అంటున్నారే తప్ప పంపిణీ చేయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంతకూ లోడ్ రాకపోవడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు.