దమ్మపేట రూరల్, నవంబర్ 3: వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కోతలు షురువైనప్పుడే కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా.. వాటి గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో ధాన్యం ఎక్కడ నిల్వ చేసుకోవాలో.. ఎవరికి అమ్ముకోవాలో.. తెలియక రైతులు తంటాలు పడుతున్నారు. మండలంలో వానకాలం పంటగా సుమారు 10,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 శాతం వరకు సన్న రకం ధాన్యాన్నే పండించారు. సన్న రకం ధాన్యంలో ఏ-గ్రేడు రకం క్వింటాకు రూ.2,320, దొడ్డు రకం బీ-గ్రేడు క్వింటాకు రూ.2,300 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది.
వారం రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా.. మరో రెండు మూడు రోజుల్లో 70 శాతం పైగా కోతలు పూర్తకానున్నాయి. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తాము పండించిన వరి ధాన్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోలేక.. పెట్టుబడి, కూలీల డబ్బులు చెల్లించాలనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యాపారులకు రూ.400 తక్కువకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధర క్వింటాకు రూ.500 కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడం వల్ల ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.400 తక్కువ, బోనస్ రూ.500 మొత్తం కలుపుకొని క్వింటాకు రూ.900 చొప్పున రైతులు నష్టపోతున్నారు. గత నెల 29న జిల్లా వ్యవసాయాధికారులు, మిల్లర్లతోపాటు సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆరోజు నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అయితే రైస్ మిల్లుల ట్యాగింగ్, సంచుల సరఫరా తదితర ఏర్పాట్లు పూర్తి కావడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. సంబంధిత శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభాలు గడిచేందుకు కొందరు వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. తమ బినామీ పేర్లపై రైతుల వద్ద కొనుగోలు చేసి నిల్వ చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించి క్వింటాకు రూ.900 వరకు వ్యాపారులు లాభాలను ఆర్జించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వలేదు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో క్రమం తప్పకుండా రైతుబంధు వచ్చేది. ఇప్పుడు ధాన్యం చేతికొచ్చినా కొనుగోలు కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియడం లేదు. బోనస్ ఇస్తారనే నమ్మకం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నాం. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
-శంకరయ్య, రైతు, తొట్టిపంపు