కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా సంగతి మాత్రం జాడలేకుండా పోతోంది. ఇప్పటికే గడిచిన వానకాలం సీజన్లోనూ రైతుభరోసా కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని అందించని రేవంత్ సర్కారు.. ఇప్పుడు మొదలైన యాసంగికైనా ఇస్తుందో.. లేదోనన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. ఇప్పటికే గడిచిన వానకాలంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకపోవడంతో రైతులందరూ అప్పులు తెచ్చుకొని మరీ ఆ సీజన్‌ను గట్టెక్కించుకున్నారు. ఇక ఇప్పుడు యాసంగిపైనా స్పష్టత కన్పించడం లేదు. ‘అదిగో.. ఇదిగో..’ అంటూ ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప స్పష్టమైన నిర్దిష్ట సమయాన్ని మాత్రం చెప్పడం లేదు. దీంతో ‘ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా? లేక మళ్లీ వడ్డీ వ్యాపారుల తలుపు తట్టాలా?’ అనే ఆవేదనను, ఆందోళనను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. చాలామంది రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పటికే గత వానకాలానికి తెచ్చిన అప్పులు పూడకపోవడంతో కొత్త అప్పులు కూడా పుట్టడం లేదు. దీంతో సీజన్ ముంగిటకొచ్చినా చేతిలో పెట్టుబడి సాయం లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా రైతులపై ఒక్కో సీజన్‌కు రూ.350 కోట్ల భారం పడుతోంది. ఆ మొత్తాన్ని రైతుభరోసా కింద ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకైనా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించడంతో గత వానకాలం సీజన్లో పంటల పెట్టుబడి సాయం అందుతుందనుకున్న అన్నదాతల ఆశలు ఉసూరుమన్నాయి. దీంతో ‘ఈ యాసంగికైనా సాయం అందేనా?’ అనుకుంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాది క్రితం వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు.. ఒక్కో సీజన్‌కు రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేలను రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. సరిగ్గా గత యాసంగి సీజన్ పెట్టుబడి సాయం అందించే సమయానికి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, రైతుబంధు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సంఘం నుంచి అనుమతి తెచ్చుకున్నా అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసి దానిని అడ్డుకోవడం, దీంతో గత యాసంగి పంటల పెట్టుబడి రైతుల ఖాతాల్లో జమ కాకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. తమ హామీ ప్రకారం తాను ఇస్తానన్న రూ.7,500 కాకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే రూ.5 వేలు మాత్రమే ఇచ్చింది. అది కూడా అధికారం చేపట్టిన చాన్నాళ్లకు కాలయాపన చేసీ చేసీ అందించింది.
గడిచిన రెండు సీజన్లుగా రైతుభరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై రైతుల్లో తిరుగుబాటు వస్తోంది. ఇలా అన్నదాతల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ దాటవేస్తూ వస్తోంది కాంగ్రెస్ సర్కారు. అయినా ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకపోవడంతో చివరికి రైతులందరూ ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని మరీ తమ పంటలను సాగు చేసుకుంటున్నారు.
ఇకపోతే కొత్త అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్న రైతులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. అనేక కొర్రీలు పెట్టి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో చాలామంది రైతులు బ్యాంకులకు తమ పంట రుణాలను చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించకుండా కొత్త రుణాలు ఇవ్వబోమంటూ బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో అధికారుల వద్దకు పరుగులు పెట్టి తమ పంట రుణాలను మాఫీ చేయాలంటూ కోరుతున్నారు. ఇటీవల నిరసనలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి.
2023 వానకాలం సీజన్ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 3.08 లక్షల మంది రైతులకు సుమారుగా రూ.360 కోట్లు పంటల పెట్టుబడి సాయంగా అందాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ప్రకారం ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.7,500 చొప్పున అందజేస్తే.. జిల్లావ్యాప్తంగా దాదాపుగా రూ.400 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాల్సి ఉంది. అయితే ఏటా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వానకాలం సీజన్ ఉంటుంది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి యాసంగి మొదలవుతుంది. ఇక గత సీజన్లో రైతభరోసా ఇవ్వకపోవడంతో సుమారు రూ.350 కోట్లు రైతులపై భారం పడినట్లయింది. ఈ యాసంగికి కూడా మరో రూ.350 కోట్ల మేర ఆర్థిక భారం పడే అవకాశముంది. ఇక వానకాలం, యాసంగి కలిపి ఇవ్వాలంటే ఎకరానికి రూ.15 వేల చొప్పున ఈ భారం రెట్టింపవుతుంది. అయితే, తెలంగాణ ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు మొదలైనప్పటి నుంచి నిరాటంకంగా అందిన రైతుబంధు వల్ల ఏటికేడు సాగు విస్తీర్ణం, దిగుబడి వంటివి పెరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాను జాప్యం చేస్తున్న కారణంగా సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
‘మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. వెంటనే వెళ్లి బ్యాంకుల్లో పంట రుణాలు తెచ్చుకోండి’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు పెట్టారు. రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మూడు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పి ‘మమ’ అనిపించారు. తీరా చూస్తే చాలామంది రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కానేలేదు. దీంతో పాత అప్పులు మాఫీ కాని రైతులెవరికీ బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వలేదు. డీసీసీబీలోని పంట రుణాలను విశ్లేషించినా ఈ విషయం అర్థమవుతుంది. ఖమ్మం డీసీసీబీలో రూ.2 లక్షల్లోపు రుణాలున్న రైతులు 1.69 లక్షల మంది ఉన్నారు. వారిలో కేవలం 65 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ కావడం గమనార్హం.