అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. నమ్మి ఓటేసిన అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఏదో కొద్దిమందికి మాత్రం అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. దీంతో మిగిలిన రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల్లో వారు తీసుకున్న పంట రుణాలకు వడ్డీలు అసలు కంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా క్రాప్‌లోన్ తీసుకున్న రైతులు 5,58,191 మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది, భద్రాద్రి జిల్లాలో 1,85,034 మంది ఉన్నారు. వీరిలో సగంమందికి కూడా రుణమాఫీ కాలేదు. అటు పంటలు సరిగా పండక.. ఇటు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో కుప్పలుతెప్పలుగా అప్పులు పెరిగి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రైతులందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
– ఇల్లెందు, మే 7
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తున్నది. వానకాలం సీజన్ ప్రారంభం నుంచీ విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన సర్కార్ ఇటు రైతుబీమా, రైతు రుణమాఫీ విషయంలోనూ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులతో ఆడుకుంటున్నది. కొద్దిమందికే రైతు రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడంతో మిగిలిన రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో తాము తీసుకున్న రుణాలకు వడ్డీలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అప్పులు కట్టలేని పరిస్థితిలో తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో రైతులు పంటలు పండించాలి అంటే ఆకాశం వైపు, అప్పుల కోసం బ్యాంకర్ల వైపు చూసే పరిస్థితి ఉండేది. కొత్తగా రాష్ట్రం ఏర్పడినాక సీఎం కేసీఆర్ రైతుబీమా, రైతు రుణమాఫీ, వ్యవసాయానికి 24గంటల కరెంట్.. ఇలా ఎన్నో గొప్ప పథకాలు అమలు చేసి రైతులను రాజు చేసేందుకు నిరంతరం కృషి చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎరువులు, విత్తనాలు సమయానికి అందడం లేదు.. రైతుభరోసా ఇవ్వడం లేదు.. యూరియా కష్టాలు, రుణమాఫీ పూర్తిస్థాయిలో కాకపోవడం.. నీటి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. సర్కార్‌పై ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ..
ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు, అన్నదమ్ములకు రుణమాఫీ విషయంలో తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వం గతంలో తండ్రికి వేరే భూమి ఉన్న విషయం గుర్తించి రుణం ఇచ్చింది, అలాగే అన్నదమ్ములకు కూడా ఇచ్చింది. కానీ, ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు గాను రేషన్‌కార్డు చూపించి రుణమాఫీ చేయలేదు. ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డులు ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల ఆధారంగా మిగిలిన రైతులకు రుణమాఫీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం క్రాప్‌లోన్ ఉన్న ప్రతి ఒక్కరికి రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.
అప్పు పెరిగిపోతున్నది..
సీఎం రేవంత్‌రెడ్డి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అంటే ఆశపడ్డాము. కానీ, రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులో వ్యవసాయ రుణం పెరిగిపోతున్నది. వ్యవసాయ లోన్ తీసుకున్న ప్రతి రైతుకూ రెండు లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వానికి మంచిదికాదు.
– మూడ్ హర్యి, రొంపేడుతండా, ఇల్లెందు
ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేయాలి
నాకు వ్యవసాయ రుణం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారం చేపట్టి రెండేళ్ల పాలన పూర్తయినా మాకు రుణమాఫీ కాలేదు. వడ్డీలు పెరిగి అప్పులు ఎక్కువై వ్యవసాయ పెట్టుబడికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా కూడా ఇవ్వడం లేదు. ఇచ్చినమాట ప్రకారం.. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలి.
– అజ్మీరా విజయ, రొంపేడు, ఇల్లెందు
మా కుటుంబంలో రుణమాఫీ కాలేదు..
నాకు ఒక బ్యాంకులో క్రాప్‌లోన్ ఉంది. అలాగే మా అమ్మకు, నా భార్యకు వేర్వేరు బ్యాంకుల్లో క్రాప్‌లోన్ ఉంది. ముగ్గురం అర్హులైనప్పటికీ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. చాలారోజులుగా బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయం చుట్టు తిరిగి తిరిగి విసుగు చెందాం. ప్రభుత్వం దయచేసి మా కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేయాలి.
– ఆంగోత్ లకుపతి, వెంకట్యాతండా, బేతంపూడి పంచాయతీ, టేకులపల్లి