కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. కనీసం వ్యవసాయానికి సరిపడా ఎరువులను కూడా అన్నదాతలకు అందజేయలేకపోతున్నది. వానకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగి సీజన్లోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు. ‘ఎరువులు అందించండి మహాప్రభో’ అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా యాసంగి సీజన్లో ఇబ్బంది లేకుండా ‘మొబైల్ యాప్’ ద్వారా యూరియాను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచి యాప్ అందుబాటులోకి రావడంతో సొసైటీ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులుదీరారు. కానీ యాప్ పనిచేయకపోవడంతో యూరియా పంపిణీ చేయాల్సిందేనని రైతన్నలు ఆందోళనకు దిగారు. దీంతో యాప్ లేదు.. గీప్ లేదు అంటూ పాత పద్ధతి(టోకెన్లు)లోనే అధికారులు యూరియాను పంపిణీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్.. అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అన్నదాతలు మాత్రం ఎరువుల కోసం మళ్లీ అవే కష్టాలు పడుతున్నారు.
– ఖమ్మం రూరల్/ తిరుమలాయపాలెం/ మధిర/ తల్లాడ, డిసెంబర్ 29

యాసంగి సీజన్లోనూ యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. మొబైల్ యాప్‌లో ముందుగా బుక్ చేసుకుంటేనే యూరియా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. సోమవారం యాప్ అందుబాటులోకి రావడంతో రైతులు యూరియా బుక్ చేయించుకునే పనిలో పడ్డారు. ఉదయం 10గంటల అవుతున్నప్పటికీ యాప్‌లో ఓటీపీలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంరూరల్ మండలం పల్లెగూడెం, తీర్ధాల సొసైటీ సెంటర్ల వద్దకు భారీగా చేరుకున్న రైతులు యాప్ పనిచేయడం లేదంటూ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ యూరియా పంపిణీ చేయాలని పట్టుబట్టడంతో తిరిగి పాత పద్ధతి(టోకెన్లు)లో అధికారులు యూరియా పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియా పంపిణీ చేసి రేపటి నుంచి యాప్ అమల్లోకి వచ్చిన తరువాత అందజేస్తామని చెప్పి పంపించేశారు.
మొక్కజొన్న పంటకు యూరియా వేయాల్సిన కీలక సమయం కావడంతో మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, చింతకాని మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్షాపుల వద్ద బారులు తీరారు. యాప్ పనిచేయకపోవడంతో బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో రైతులు బోనకల్లు- వైరా ప్రధానరోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకొని రాకపోకలను పునరుద్ధరించారు.
చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ‘శ్రీనివాస్ ఫెర్టిలైజర్స్’ ప్రైవేట్ డీలర్ ఆదివారం రాత్రే అక్రమంగా యూరియా విక్రయాలు జరిపాడు. యాప్ ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలని మధిర వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయ్‌చంద్ర ఆదేశించినప్పటికీ సదరు డీలర్ అక్రమంగా విక్రయాలు జరిపాడు. యూరియా కావాలంటే కచ్చితంగా మరో కాంప్లెక్స్ ఎరువును కొనాలని డీలర్ నిబంధన పెట్టడంతో రైతులు గత్యంతరం లేక కొనుగోలు చేశారు. పెద్ద రైతులకు కావాల్సినంత యూరియా ఇచ్చి, సన్నకారు రైతులను పట్టించుకోకపోవడంతో చిన్నమండవ, సీతంపేట, పాతర్లపాడు, తిమ్మినేనిపాలెం గ్రామాల రైతులు షాపు వద్ద ఆందోళన చేశారు. డీలర్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మధిర ఏడీఏ తెలిపారు.
యూరియా కోసం తల్లాడ మండలానికి చెందిన రైతులు తల్లాడ వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తల్లాడ వ్యవసాయ అధికారి రైతులందరికీ యూరియా అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మండలంలోని తిరుమలాయపాలెం, పిండిప్రోలు, జల్లేపల్లి, బచ్చోడు గ్రామాల్లో యాప్ బుకింగ్ ద్వారా 2,560 యూరియా బస్తాల పంపిణీకి వ్యవసాయాధికారులు సిద్ధమయ్యారు. కానీ యాప్ పని చేయకపోవడం, రైతులు పీఏసీఎస్ గిడ్డంగుల వద్ద బారులుదీరడంతో గత్యంతరం లేక అధికారులు పాతపద్ధతిలోనే యూరియా బస్తాలను పంపిణీ చేశారు. పిండిప్రోలులో ఒక్క రైతుకు ఒక్క బస్తా, తిరుమలాయపాలెంలో రెండు బస్తాలు అందజేశారు. చాలామంది రైతులు యూరియా దొరక్క ఇంటిబాట పట్టారు. ప్రతిరోజూ పంపిణీ చేస్తామని ఏవో సీతారామిరెడ్డి తెలిపారు.
సెల్ఫోన్లో బుకింగ్ ద్వారా యూరియా ఇస్తారంట. మాకు పెద్ద ఫోన్ లేదు. ఏంచేయాలి. పొద్దటీలి వచ్చిన.. ఒక్క కట్ట యూరియా కూడా దొరకలేదు.. కాగితాలు ఇయ్యమంటే ఇచ్చిన. లైన్లో పెట్టిర్రు. బువ్వలేదు.. నీళ్లు లేవు. రైతులను ఇంత ఘోష పెడుతుర్రు. జనం ఎక్కువుర్రు ఇయాల ఇవ్వం.. రేపు అందరికీ ఇస్తాం అంటుర్రు. ఏంచేయాలో తోచడం లేదు.
– దడిదల కమలమ్మ, రైతు, జల్లేపల్లి, తిరుమలాయపాలెం
యాసంగిలో ఐదెకరాల పొలం, రెండెకరాల మిర్చి, ఐదెకరాల మొక్కజొన్న మొత్తం పన్నెండు ఎకరాలు సాగు చేస్తున్నాను. మూడ్రోజులుగా తిరుగుతున్నా.. ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదు. రేపు ఇస్తాం అంటున్నారు. ప్రభుత్వం యూరియా ఇవ్వకపోతే పంటలు ఎలా పండుతాయో అర్థంకావడం లేదు. ఇచ్చినోళ్లకేమో ఎక్కువ బస్తాలు ఇస్తున్నారు. రోజూ సొసైటీ దగ్గరకు వచ్చి పడికాపులు కాచి పోవాల్సి వస్తోంది.
– జి. బద్యా, రైతు, జల్లేపల్లి, తిరుమలాయపాలెం
గత ప్రభుత్వ హయాంలో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడలేదు. ఆటోవాళ్లకు డబ్బులు ఇస్తే చేను వద్దకు బస్తాలు తెచ్చేది. ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నది. యాప్ ద్వారా బుకింగ్ ఏమిటీ. రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించాలి. మేము పదెకరాల్లో వరి, ఇతర పంటలు వేశాం. లైన్ ప్రకారం కాగితాలు ఇస్తే నాకు ఒక్క బస్తా యూరియా కూడా దొరకలేదు.
– అల్లి ప్రమీల, రైతు, జల్లేపల్లి, తిరుమలాయపాలెం