ఇల్లెందు/ టేకులపల్లి/ ముదిగొండ/ మధిర/ బోనకల్లు/ ఎర్రుపాలెం/ మణుగూరు టౌన్/ కూసుమంచి (నేలకొండపల్లి), అక్టోబర్ 20: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు మోసకారితనం మరోసారి బయటపడిందంటూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. రైతుభరోసా పేరిట ముమ్మాటికీ మోసమే చేసిందని, మంత్రి తుమ్మల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. వానకాలం రైతుభరోసా ఇవ్వబోమని, యాసంగిలో కూడా పంట వేసిన రైతులకే ఇస్తామని, అది కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చాకే చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు భగ్గుమన్నారు.
ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు మండలాల్లో ఆదివారం ఆందోళనలు నిర్వహించారు. మణుగూరులో రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో జరిగిన ధర్నాల్లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లెందు, టేకులపల్లి, ముదిగొండ, మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, మణుగూరు, నేలకొండపల్లి మండలాల్లో జరిగిన ఆందోళనల్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో కర్షకులను వంచించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు రైతుభరోసా విషయంలోనూ మరోసారి మోసం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలోని రేవంత్ సర్కారు హామీలను అమలు చేయకుండా అన్నదాతలకు నయవంచనకు గురిచేసిందని రైతులు, బీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున నిర్విరామంగా రైతుబంధు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మొత్తానికే ఇవ్వకుండా ఎగనామం పెడుతోందని ధ్వజమెత్తారు. గడచిన వానకాలం రైతుభరోసా ఇవ్వబోమంటే తాము ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సబ్ కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి సాయం అందిస్తామంటే సహించబోమని స్పష్టం చేశారు. గడిచిన వానకాలం, రాబోయే యాసంగి సీజన్లకు కలిపి రెండు విడతల పంటల సాయం కలిపి రూ.15 వేలను ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ డిమాండ్ చేశారు. రైతుల సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, మంత్రి తుమ్మల వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వానకాలం రైతుభరోసా పంటల సాయం ఇవ్వబోమంటూ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు, రాసార్తోకోలు నిర్వహించారు. టేకులపల్లి బస్టాండ్ సెంటర్లో, ఇల్లెందు జగదాంబ సెంటర్లో, ముదిగొండ బస్టాండ్ సెంటర్లో, మధిర మండల కేంద్రంలో, ఎర్రుపాలెం మీనవోలు సెంటర్లో, బోనకల్లు ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. మణుగూరులో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి సాయం అందించింది. ఈ ఏడాది పెట్టుబడికి రైతుబంధు రాకపోవడంతో విత్తనాలు, ఎరువులు కొనేందుకు డబ్బు లేక చాలా ఇబ్బందులపాలయ్యాం. మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపాలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఒరిగిందేమీ లేదు, అన్నీ కష్టాలే.
– పూనెం లింగమ్మ, చల్లసముద్రం, ఇల్లెందు మండలం
గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏడాదికి రెండు విడతలుగా ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా పేరుతో ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇప్పటివరకూ రూపాయి ఇచ్చింది లేదు. వానకాలం పోయినా రైతుభరోసా లేదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది.
– అజ్మీరా కవిత, పోలవరం, ఇల్లెందు మండలం