బోనస్ నగదు చెల్లింపుల్లోనూ కాంగ్రెస్ సర్కారు తన మాయమాటల మార్క్ చూపిస్తోంది. దీంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు. వరి పంట పండించిన రైతుల్లో ఏ ఇద్దరు ఎదురుపడినా బోనస్ గురించే ఆరా తీస్తున్నారు ‘బోనస్ డబ్బులు పడ్డయా మావా..’ అంటూ యువ రైతులు పలుకరిస్తుండగా.. ‘బోనస్ లేదు.. గీనస్ లేదు రా..’ అంటూ వృద్ధ రైతులు నిట్టూరుస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు పల్లెల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో కన్పిస్తున్నాయి. సర్కారోళ్లకు వడ్లు విక్రయించి 50 రోజులు దాటిపోయిందని, క్వింటాకు రూ.500 చొప్పున ఇస్తామన్న బోనస్ డబ్బులకు జాడే లేకుండా పోయిందని వాపోతున్నారు.
ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే బోనస్ ఇస్తామని, రెండు రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే మాట ఇచ్చారని రైతులు గుర్తు చేస్తున్నారు. కానీ.. అవన్నీ మాయమాటలేనని, వడ్లు విక్రయించాక నెలల తరబడి ఎదురుచూస్తున్నా బోనస్ డబ్బులు మాత్రం వేయడం లేదని మండిపడుతున్నారు. రోజూ బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చూసుకుంటున్నామని, బోనస్ డబ్బులు రూపాయి కూడా పడలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకు పెట్టుబడి ఖర్చులు పోయినా.. క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తే రెక్కల కష్టమైనా మిగులుతుందని ఆశించామని అంటున్నారు.
అందుకోసమే కాయకష్టం చేసి సన్న వడ్లు పండించామని, కష్టమైనా తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించామని చెబుతున్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని, బోనస్ పేరు చెప్పి ఓట్లు వేయించుకుందని, కానీ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.500 బోనస్ జమ చేయట్లేదని, నెలల తరబడి ఇవ్వకుండా ఏడిపించుకుతింటోందని గోడుమంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ రైతును పలుకరించినా ఇదే ఘోసను వెళ్లబోసుకుంటున్నారు.
-ఖమ్మం, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నేను 30 క్వింటాళ్ల సన్న వడ్లు సహకార సంఘం వారికి అమ్మి రెండు నెలలు దాటింది. కానీ.. ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పిన క్వింటాకు రూ.500 చొప్పున అందించే బోనస్ ఇంతవరకు ఇవ్వలేదు. కొందరు రైతులకు మాత్రమే వేసి.. అందరు రైతులకు వేశామని గొప్పలు చెప్పుకోవడం సరికాదు. రైతులకు ప్రభుత్వ పాలన మీద నమ్మకం పోయింది. రైతుల కష్టాన్ని, ఇబ్బందులను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి.
-నాగబోయిన కాళేశ్వరరావు, రైతు, నరసింహాపురం, ఎర్రుపాలెం మండలం
రైతుభరోసా పేరిట ఇప్పటికే మమ్ములను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వడ్లకు అందించే బోనస్ విషయంలోనూ మాయమాటలే చెబుతోంది. ప్రభుత్వానికి వడ్లు అమ్మిన వెంటనే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ వడ్లు విక్రయించి రోజులు గడుస్తున్నా బోనస్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికే వానకాలం రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేయడంతో సేటు దగ్గరకు వెళ్లి అప్పు తెచ్చుకున్నాం. ఇప్పుడు యాసంగి రైతుభరోసా ఇవ్వకుండా రెండో పంట వేయలేం. ఇక బోనస్ నగదు ఎప్పుడు జమ చేస్తరో ఏమో చూడాలి.
-తెల్లం సత్యం, రైతు, చిన్నరాయిగూడెం, మణుగూరు
మద్దుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజుల క్రితం 106 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాను. నాకు ఇప్పటివరకు బోనస్ డబ్బులు రాలేదు. అధికారులను అడిగితే.. మా చేతుల్లో ఏమీలేదని, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు మీ ఖాతాల్లో పడుతాయని చెబుతున్నారు. నాకు రుణమాఫీ రాలేదు. రైతు భరోసా రాలేదు. అట్లాగే రైతు బోనస్ వస్తుందో.. రాదో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తది.
– నల్లమోతు వెంకటనారాయణ, రైతు, మద్దుకూరు, చండ్రుగొండ మండలం
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఈసారి మొత్తం సన్న వడ్లను సాగు చేసినం. బాగానే పెట్టుబడి పెట్టినం. అప్పు చేసి మరీ సన్నాలు పండించాం. బోనస్ వస్తే పెట్టుబడులు తీరుతాయని అనుకున్నాం. అందుకోసం సహకార సొసైటీకి వెళ్లి వడ్లు విక్రయించాం. ఇప్పటికి నెలా పదిహేను రోజులు దాటిపోయింది. కానీ మా బ్యాంకు ఖాతాలో బోనస్ నగదును జమ చేయలేదు. ఇదేమిటని అధికారులను అడిగితే.. ‘వస్తాయమ్మా.. కొన్నిరోజులు ఆగండి..’ అని చెబుతున్నారు.
– కొమరం కాంతమ్మ, మహిళా రైతు
నేను డిసెంబర్ చివరి వారంలో రెండుసార్లు బేతంపూడి సొసైటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో 62 క్వింటాళ్ల వరి ధాన్యం వేశాను. దానికి సంబంధించిన డబ్బులు జనవరి 8న నా ఖాతాలో పడ్డాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా బోనస్ రూ.500 చొప్పున బోనస్ డబ్బులు ఇంతవరకు పడలేదు. డిసెంబర్ నుంచి బోనస్ డబ్బులు ఎప్పుడు పడతాయా.. అని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం బోనస్ డబ్బులు వేయాలి.
– నారందాస్ కోటయ్య, రైతు, బొమ్మనపల్లి
డిసెంబర్ నెలలో 92 క్వింటాళ్ల ధాన్యం బేతంపూడి సొసైటీలో వేశాను. అందుకు సంబంధించిన డబ్బులు జనవరి నెలలోనే నా ఖాతాలో పడ్డాయి. కానీ.. బోనస్ డబ్బులు రూ.500 చొప్పున ఇప్పటివరకు పడలేదు. దీనిపై సొసైటీ అధికారులను అడిగితే వస్తాయి అని చెబుతున్నారే తప్ప ఇంతవరకు పడలేదు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బోనస్ డబ్బులు త్వరగా వచ్చే విధంగా చూడాలి. రైతుల ఇబ్బందిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
– పొగాకు పాపారావు, రైతు, అనిశెట్టిపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలం