తరుగు, కొర్రీలు లేకుండా ధాన్యం తీసుకోవాలని, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు ఉమ్మడి ఖమ్మ జిల్లా మధిర, తిరుమలాయపాలెం, చండ్రుగొండ మండలాల్లో శనివారం ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన శ్రమ అంతా వృథా అవుతుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
మధిర, మే 3 : విక్రయానికి తరలించిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మధిర-విజయవాడ ప్రధాన రహదారిపై శనివారం ధర్నా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, రైతు సంఘం నాయకులు పాపినేని రామనర్సయ్య, శీలం నరసింహారావు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి 15 రోజులు అవుతున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.
వర్షం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోతున్నదని, దీనికి ఎవరు బాధ్యత వహించాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులు, సీపీఎం నాయకులతో మాట్లాడారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మందా సైదులు, పడకంటి మురళి, తేలప్రోలు రాధాకృష్ణ, ఊట్ల శంకర్రావు, పుచ్చకాయల కిశోర్, రైతులు పాల్గొన్నారు.
చండ్రుగొండ, మే 3 : కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల తరుగు దోపిడీని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మార్కెట్ గోదాముల సముదాయంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. కాంటా వేసిన ధాన్యం బస్తాలను మిల్లులో దించడానికి క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేయడంతో ససేమిరా అన్న రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేయడం సరికాదన్నారు. క్వింటాకు 2.100 గ్రాముల వరకు అదనంగా కాంటా వేయడంతోపాటు అదనంగా మరో 5 నుంచి 7 కేజీలు తరుగు పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో పట్టపగలే ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. మిల్లర్ల అవినీతిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుమలాయపాలెం, మే 3 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బందంపల్లి గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి రోజులతరబడి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. కేంద్రాల్లో రైతులను నిర్వాహకులు, మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బింగి రమేశ్, తుళ్లూరి నాగేశ్వరావు, కోడి లింగయ్య, వీరేష్, చాగంటి వీరస్వామి, దుబాకుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.