బోనకల్లు, ఏప్రిల్ 20 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం బోనకల్లు – ఖమ్మం రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. పలువురు రైతులు మాట్లాడుతూ ముష్టికుంట్ల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట సాగు చేశామని, ప్రస్తుతానికి కోతలు పూర్తి కావడంతో పంట చేతికొచ్చినా కొనే దిక్కులేదని మండిపడ్డారు.
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దూర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుండడంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు స్థానికంగా వ్యాపారులకు విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కాగా, రైతులు ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు అకడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు.
తక్షణమే ముష్టికుంట్లలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బంధం నాగేశ్వరరావు, షేక్ ఇబ్రహీం, పర్వతాచారి, సీపీఎం నాయకులు కిలారి సురేశ్, బంధం శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.