బోనకల్లు, ఏప్రిల్ 20 : ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రావినూతల, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన రైతులు బోనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికారులను కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం రైతులు కార్యాలయంలోకి వెళ్లి తహసీల్దార్ చాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన ఇలాగే కొనసాగుతుందని భీష్మించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ముష్టికుంట్ల, రావినూతల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కొమ్మినేని ఉపేందర్, తన్నీరు పుల్లారావు, బంధం నాగేశ్వరరావు, షేక్ ఇబ్రహీం, కిలార్ సురేశ్, గుగులోతు నరేశ్, యంగళ ఆనందరావు, తొందర భాసరరావు తదితరులు పాల్గొన్నారు.