గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల ఆట కంటే డోపింగ్ ఉల్లంఘనలే చర్చనీయాంశమయ్యాయి. భారత జూడో జట్టులో మరోసారి డోపింగ్ కలకలం రేగింది.గత ఎడిషన్‌లో రజతం గెలిచిన స్టార్ జుడోకా తులికా మాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో గ్లాస్గో చేరుకోకముందే తులికా మెగా గేమ్స్ నుంచి వైదొలిగింది.
గడిచిన ఏడాదికాలంలో మూడుసార్లు తన వివరాలను చెప్పకుండా డోపింగ్ పరీక్షలను తప్పించుకున్నందుకు గాను ఆమె సస్పెన్షన్‌కు గురైంది. రిజిష్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో ఉన్న క్రీడాకారులు తప్పనిసరిగా తాము ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఎక్కడ శిక్షణ తీసుకుంటున్నాం? తదితర పూర్తి వివరాలను నాడాకు తెలియజేయాల్సి ఉంటుంది. లేకుంటే అది డోపింగ్ ఉల్లంఘనల కిందకు వస్తుంది. కాగా తులికాపై వేటుతో భారత జుడో పతక ఆశలకూ గండి పడనుంది.
బర్మింగ్హమ్ ఎడిషన్‌లో జుడో విభాగంలో భారత్ మూడు పతకాలు గెలువగా అందులో తులికా (రజతం) కూడా ఉంది. ఈసారీ పతక రేసులో ముందంజలో ఉండగా ఆమె సస్పెన్షన్‌కు గురవడం పతకాలపై ప్రభావం చూపించనుంది. ఇప్పటికే జుడోకా అరుణ్ కుమార్ సైతం ఔట్ ఆఫ్ కాంపిటీషన్ డోప్ టెస్టులో విఫలమై టోర్నీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
రెండో రోజు భారత్ పతకం అందుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన పారా వెయిట్ లిఫ్టింగ్ మెడల్ ఈవెంట్లలో మన లిఫ్టర్లు విజయానికి చాలా దూరంలో నిలిచిపోయారు. పురుషుల లైట్ వెయిట్ విభాగం ఫైనల్లో అశోక్ 200 కిలోల బరువెత్తి 143.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం చేజార్చుకున్నాడు. పరమ్‌జీత్ కుమార్ 135.6 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టాడు. ఇంగ్లండ్ కు చెందిన మార్క్ స్వాన్ 153.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఈ ఎడిషన్ మెగా గేమ్స్‌లో తొలి స్వర్ణం అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. నైజారియా లిఫ్టర్ రోలాండ్ ఎజురుకే (153.9) రజతం, మలేషియాకు చెందిన బోనీ బున్యావు గస్టిన్ (153.5) కాంస్యం సాధించారు. మహిళల పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్లు జస్ప్రీత్ కౌర్ 94.4 స్కోరుతో ఆరో స్థానం, సుమన్ దేవి (88.4) 8వ స్థానంతో నిరాశపరిచారు.
పారా స్విమ్మింగ్‌లో ఆశలు రేపిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బుడిగిన రవి కార్తీక్ కొద్దిలో పతకం కోల్పోయాడు. పురుషుల ఎస్13 విభాగం 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో రవి 57.57 సెకండ్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హెండ్రిక్స్ (54.54 సె) స్వర్ణం గెలవగా.. స్కాట్లాండ్ స్విమ్మర్ స్టీఫెన్ క్లెగ్ (55.16 సె), ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ రెడ్‌ఫెర్న్ (56.86 సె) రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరో పారా స్విమ్మర్ అలీ ఇమామ్ ఏడో స్థానంతో నిరాశపరిచాడు. మరోవైపు స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పురుషుల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో సెమీస్ చేరాడు. హీట్స్‌లో అతను 25.52 సెకండ్లతో ఐదో స్థానం, ఓవరాల్‌గా 14వ ప్లేస్‌తో ముందంజ వేశాడు.
లాన్ బౌల్స్ భారత ప్లేయర్లు రెండో రోజూ సత్తా చాటారు. విమెన్స్ పెయిర్ ఈవెంట్ సెక్షన్-బిలో రూపా రాణి-పింకి సింగ్ ద్వయం 2-0తో దక్షిణాఫ్రికా ప్రత్యర్థులను ఓడించింది. మెన్స్ సింగిల్స్ పోరులో పుతుల్ టై బ్రేక్‌లో సిసిల్పై గెలిచి వరుసగా రెండో విజయం అందుకున్నాడు.
బాక్సింగ్‌లో జాదుమణి సింగ్ శుభారంభం చేశాడు. పురుషుల 55 కేజీ తొలి రౌండ్ పోరులో పవర్ఫుల్ పంచ్‌లు విసిరిన జాదుమణి 5-0తో ఆతిథ్య స్కాట్లాండ్ బాక్సర్ ఆరోన్ కులెన్ను చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.