కొణిజర్ల, ఏప్రిల్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామంలో రైతు భుక్యా శ్రీనుకు చెందిన మూడెకరాల్లో ఎండిపోయిన మొక్కజొన్న పంటను ఎంపీ నామా.. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే సర్కారు చోద్యం చూస్తోందన్నారు. ఒక్క తడికి సాగునీరు అందించలేని సర్కారు కనీసం పంట నష్టాన్ని కూడా పరిశీలించే పరిస్థితి లేదన్నారు. ఇంత కన్నా లోటు వర్షపాతం నమోదైనప్పుడు సాగునీరు అందించిన సందర్భాలు గత కేసీఆర్ సర్కారు హయాంలో ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో 4 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, భూగర్భ జలాలు అడుగంటి చుక్కనీరు అందే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం రైతాంగానికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన రైతు భూక్యా శ్రీను అనారోగ్యంతో బాధపడుతూ మూడెకరాల్లో పంట సాగు చేసి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాడని, వెంటనే ఆ రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మాయమాటలు, అమలుకు నోచుకోని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. రాష్ట్రంలో సాగునీరే కాదు.. తాగునీరు కూడా లభించే పరిస్థితి లేదన్నారు. పాలేరు వంటి రిజర్వాయర్లు నిలువునా ఎండిపోయే పరిస్థితి ఉన్నదని, పాలేరు చరిత్రలో ఇంత దుర్మార్గమైన పరిస్థితులు మునుపెన్నడూ లేవన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, భవిష్యత్‌లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోట్ల కవిత, బీఆర్ఎస్ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, బోడపోతుల బాబు, దొడ్డపునేని రామారావు, చెరుకుమల్లి రవి, చల్లా మోహన్‌రావు, రాయల నాగేశ్వరరావు, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, ధరావత్ మాన్సింగ్, భూక్యా మీటు, కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, దామా విజయ్, తాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.