బోనకల్లు, సెప్టెంబర్ 20 : సొసైటీ పరిధిలోని రైతులు దాదాపు 400 మంది బోనకల్ మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామునే చేరుకున్నారు. పొద్దంతా బస్తాల కోసం పడిగాపులు కాశారు. సొసైటీకి 323 బస్తాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు తమ పేర్లు రాసుకోవాలని సొసైటీ సిబ్బంది ఎదుట ఒక్కసారిగా ఎగబడ్డారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఎస్సై పొదిలి వెంకన్న, వ్యవసాయాధికారి వినయ్‌కుమార్ సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. సక్రమంగా యూరియా పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టారు.
ఆధార్ కార్డు ప్రకారం కాకుండా.. సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఒకే కుటుంబంలో ఐదు ఆధార్ కార్డులు ఉంటే.. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పు పంపిణీ చేస్తే.. మిగిలిన వారికి యూరియా దొరకదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట సాగుకు సరిపోయే విధంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ సిబ్బంది మాత్రం స్టాక్‌కు సరిపోయే విధంగా కూపన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు.
కొణిజర్ల, సెప్టెంబర్ 20 : గోపవరం సొసైటీ కార్యాలయం వద్దకు ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వచ్చి క్యూలో నిల్చున్నారు. సొసైటీ వద్ద శుక్రవారం రైతుల వద్ద పాస్ పుస్తకాల ప్రతులు తీసుకున్న సిబ్బంది యూరియా కోసం శనివారం రావాలని సూచించారు. దీంతో రైతులతోపాటు కొత్త కాచారం గ్రామానికి చెందిన ఏ 80 ఏళ్ల వృద్ధురాలు చేతికర్ర సాయంతో సొసైటీ వద్దకు వచ్చి క్యూలో నిల్చుంది.
తన సీరియల్ నంబర్ రాకపోవడంతో ఓపిక లేకపోవడంతో పక్కనే ఉన్న గద్దెపై కూర్చుంది. అనంతరం ఆమెకు యూరియా బస్తా పంపిణీ చేశారు. తన కొడుకు పత్తి, వరి పంట సాగు చేశాడని, మనిషికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో నేను కూడా వచ్చానని చెప్పింది. ఇదిలా ఉండగా.. గోపవరం సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రద్దీ కొనసాగింది.