మా మనుమడికి రెండేండ్లు. పుట్టిన తర్వాత వాడి తలమీద ఒక బొడిపెలాగా పెద్దగా వాపు వచ్చింది. అది మెల్లగా తగ్గిపోతుందని డాక్టర్లన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత అది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు తల ఆకారం మారిపోతున్నది. తల ఒకవైపు లోపలికి ఒత్తుకుపోయినట్టుగా మారిపోయింది. అబ్బాయి ఒకవైపే ఎక్కువగా చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. అదే వైపున తల లోపలికి సొట్ట పోయింది. తల నుదురువైపు ముందుకు వచ్చినట్టుగా ఉంది. ఇలా తల ఆకారం మారడం వల్ల మెదడుపై ప్రభావం ఉంటుందా? మెదడుకు మున్ముందు ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? ఈ సమస్యకు పరిష్కారం ఉందా?
ప్రసవ సమయంలో శిశువు తలకు గాయం అయినప్పుడు శిశువు తలలో చర్మం కింద, తల ఎముకల మధ్య రక్తస్రావం జరిగినప్పుడు అది గడ్డకడుతుంది. అది మెల్లగా కరిగిపోతుంది. ఎత్తుగా బొడిపెలా ఉన్న ఆకారం పోతుంది. పిల్లల తల మెత్తగా ఉంటుంది. ఒకవైపే తిప్పి పడుకుంటే లోపలికి ఒత్తుకుపోతుంది. ఆ ఒత్తిడి ఎక్కువ సమయం ఉండటం వల్ల తల సొట్టపడ్డట్టుగా మారిపోతుంది. వేరే కారణాల వల్ల కూడా తల లోపలికి సొట్టపడుతుంది. తలలో ట్యూమర్ తయారు కావడం, తలలో ఎముకల అమరిక, ఇతర కారణాల వల్ల తల అసాధారణమైన ఆకారంలోకి మారిపోవచ్చు.
ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మెడ కదలికలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. మెడ రెండు వైపులకు సరిగా తిప్పగలుగుతున్నాడా? లేదా? గుర్తించాలి. రెండు వైపులకు సమంగా తిప్పలేకపోతే డాక్టర్లకు చూపించాలి. పిల్లలు మెడను రెండు వైపులకు సమంగా తిప్పగలిగితే ఇంకో వైపునకు తలతిప్పి పడుకోబెట్టాలి. కొన్ని వారాలు, నెలల్లో తల ఆకారం మంచిగా మారుతుంది. ఆరు నెలల వరకు ఇలా ప్రయత్నించాలి. కొంతమంది పిల్లల తల వెనుక భాగం బాగా అణిగిపోయినట్లు ఉంటుంది. ఇలాంటి వాళ్లను పొట్టమీద పడుకోబెట్టాలి. తల సాధారణ రూపంలోకి మారకపోతే, ఒత్తుకుపోయినట్టు ఉంటే పొజిషనల్ థెరపీ చేస్తాం.
తల నిర్మాణంలో ఉండే ఎముకలు ఒకదానికొకటి అతుక్కుపోతే తల ఆకారం అసాధారణంగా ఉంటుంది. తల్లి గర్బంలో తల ఎముకలు ఏర్పడేటప్పుడు అతుక్కుపోతే.. పెరిగేటప్పుడు తల త్రికోణాకారంలో లేదా వేరే రూపంలో ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఎదుగుదల సమస్యలే కాకుండా కంటి చూపు సమస్య కూడా ఉంటుంది. ఈ పిల్లలకు సీటీ స్కాన్, ఇతర పరీక్షలు చేసి, రకరకాల చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత మంచిది.
మెదడు మొదటి రెండు సంవత్సరాల్లో ఎనభై శాతం ఎదుగుతుంది. ఈ కాలంలో కష్టాలుంటే మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తలలో ఎముకలు అతుక్కుపోయి ఉంటే ఆ పిల్లల కళ్లు బయటికి వచ్చినట్టుగా కనిపిస్తాయి. రాత్రి పడుకోరు. తరచూ ఏడుస్తారు. ఆహారం సరిగా తినరు. ఎదుగుదల సరిగా ఉండదు. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఎండోస్కోపిక్ ద్వారా ఎముకలను విడగొట్టొచ్చు. ఆరు నెలల నుంచి రెండేళ్ల మధ్య ఆలస్యంగా గుర్తిస్తే… బ్రెయిన్ మీద ఒత్తిడి తగ్గించడానికి, తల సాధారణ ఆకారంలోకి తేవడానికి మేజర్ సర్జరీ అవసరం పడుతుంది. ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సరైన చికిత్సకు అవకాశం ఉంటుంది.
– డాక్టర్ కొక్కుల ప్రణీత్
పీడియాట్రిక్ న్యూరో సర్జన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్