హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఆ ప్రక్రియ నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా తొలి విడత జనగణనను మే 11న ప్రారంభించి జూన్ 9న పూర్తిచేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో జనగణనపై మంత్రులు చర్చించారు.
ఈ సందర్భంగా జనగణన నిర్వహణకు ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను సీఎస్ రామకృష్ణారావు క్యాబినెట్‌కు వివరించారు. జనగణనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఫార్మాట్‌ను పంపిందని, ఇందులో మొత్తం 34 ప్రశ్నలు ఉన్నాయని, వాటి ఆధారంగానే జనగణన చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రతి ఇంటికి వెళ్లి జనగణన చేసేందుకు దాదాపు 89 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరమవుతారని అంచనా వేశామని, రెండో విడత జనగణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే జనాభా వివరాల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్విభజించాలని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.