దుమ్ముగూడెం, సెప్టెంబర్ 19: పంటలు వేసి 45 రోజులైనా యూరియా వేయకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దుమ్ముగూడెం సొసైటీ వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తెల్లవారుజామునే చేరుకొని క్యూలో నిల్చున్నారు.
అయితే ఇందులో కొందరికి మాత్రమే యూరియా అందింది. గురువారం ఆధార్ కార్డు ప్రతులు ఇచ్చిన వారికి మాత్రమే అధికారులు ఈరోజు యూరియా పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎరువులు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేను ఐదు ఎకరాల్లో పంట సాగు చేస్తున్నా ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వడం లేదు. ఉదయమే సొసైటీ కార్యాలయం వద్దకు వచ్చి వరుసలో నిల్చున్నా. ఇలా ఎన్ని రోజులు తిరగాల్నో అర్థం కావడం లేదు. ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ యూరియా ఇస్తున్నారు. అధికారులు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
-తెల్లం పెంటమ్మ, ములకపాడు
కొన్ని రోజులుగా సహకార సంఘ కార్యాలయం వద్దకు యూరియా కోసం వస్తున్నా. ఈ రోజు వరకు ఒక్క బస్తా కూడా అందలేదు. పంటలు సాగు చేసి 45 రోజులు గడుస్తున్నా యూరియా అందకపోవడంతో పంట ఏపుగా వచ్చే పరిస్థితి లేదు. దీంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. యూరియా అందే విధంగా అధికారులు చూడాలి.
-పెనుబల్లి జ్యోతి, పెద ఆర్లగూడెం