‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెతలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధితో అలవిగాని హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేక మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో నమ్మి ఓట్లేసిన ప్రజలకే పంగనామాలు పెడుతోంది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. నిరుపేదలందరికీ పథకాలను అందిస్తామంటూనే అర్హులను మాత్రం గణనీయంగా తగ్గిస్తోంది. గొప్పగా చెప్పిన రుణమాఫీ విషయంలోనూ సరిగ్గా ఇదే విధానాన్ని అవలంబించింది. దీంతో లక్షలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీనే జరగలేదు.
ఇటీవల నాలుగు పథకాలకు అర్హులను ఎంపిక చేశామంటూ గ్రామసభలను పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అనర్హుల పేర్లతో జాబితాలను నింపింది. లిస్టుల్లో పేర్లను చూసిన నిరుపేదలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పథకాలన్నీ అనర్హులకు, అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చి.. మాలాంటి పేదలకు పంగనామాలు పెడతారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని చెప్పని ప్రభుత్వం.. అర్హులకు మాత్రం మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించింది.
అయితే, ఎంపిక చేసిన అర్హుల్లోనూ తన మార్క్‌ను చూపించుకుంది. అన్ని పథకాలకూ అరకొరగానే అర్హులను ఎంపిక చేసింది. దీంతో ఏ గ్రామసభను చూసినా నిలదీతలే కన్పించాయి. దీంతో ‘పేరుకు మాత్రం పథకాన్ని అమలుచేసినట్లుగా ఉండాలి. కానీ ఆ పథకం అర్హులందరికీ చేరొద్దు. కొద్దిమందికి మాత్రమే పథకాన్ని చేర్చి.. అందరికీ అమలుచేసినట్లు ప్రచారం చేసుకోవచ్చు’ అనే పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది. తిరుమలాయపాలెం మండలంలోని పైలట్ గ్రామమైన ఏలువారిగూడేన్ని పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతోంది. -తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 2
అలవిగాని హామీలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఎలాగైనా బోల్తా కొట్టించాలని చూస్తున్నట్లుగా కన్పిస్తోంది. ‘ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అనే నాలుగు పథకాలను గణతంత్ర దినోత్సవమైన జనవరి 26 నుంచి అమలు చేస్తామని, ఈ పథకాలకు అర్హులను ఇప్పటికే గుర్తించామని ప్రకటించిన ప్రభుత్వం.. గత నెల 21 నుంచి 24 వరకూ ఊరూరా గ్రామసభలు పెట్టి అర్హుల జాబితాను ప్రదర్శించింది.
దీంతో ఆయా జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ప్రతి ఊరిలోనూ గ్రామసభలు రసాభాసగా మారాయి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసిన దృశ్యాలే కన్పించాయి. తమకు అర్హత ఉన్నప్పటికీ తమ పేరును జాబితాలో చేర్చకపోడం, అదే సమయంలో అనర్హులను చేర్చడం వంటి కారణాలతో ప్రభుత్వంపై నిరుపేదలు మండిపడ్డారు. ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తే ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే అర్హుల సంఖ్యను భారీగా తగ్గించినట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు ఆ నాలుగు పథకాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలుచేస్తున్న పైలట్ గ్రామమైన తిరుమలాయపాలెం ఏలువారిగూడేన్ని పరిశీలిస్తే అర్హులను ఏ స్థాయిలో తగ్గించారో వెల్లడవుతోంది.
‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరిట పథకాన్ని అమలుచేస్తున్నామని, దీని ద్వారా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ జాతీయ ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్న వాళ్లు, దానిపై ఏడాది (2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 లోపు)లో కనీసం 20 పనిచేసిన వాళ్లే దీనికి అర్హులని ప్రకటించింది. అయితే, ఈ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వాళ్లు అనేకమంది ఉన్నప్పటికీ వారిలో భారీ స్థాయిలో కోతలు విధించింది. తిరుమలాయపాలెం మండలంలో 18,165 కుటుంబాలకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులున్నాయి. వీరిలో అసలు భూమిలేని కుటుంబాలు సుమారు 10 వేలు ఉంటాయి. అయితే అనేక కొర్రీలు పెట్టిన ప్రభుత్వం.. మండలంలోని 40 గ్రామ పంచాయతీల పరిధిలో కేవలం 1,767 కుటుంబాలనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా గుర్తించింది.
అంటే సుమారు 90 శాతం మందిని అనర్హులను చేసింది. కానీ ఆయా గ్రామసభల్లో ఈ పథకం జాబితాలో తమ పేర్లు లేని అర్హులంతా ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సలహా ఇచ్చినప్పటికీ.. అప్పటికే ఎంపికచేసిన వారికి మాత్రం (అర్హులు+అనర్హులు) రూ.6 వేల చొప్పున నగదు బదిలీ చేసింది. పైలగ్ గ్రామమైన ఏలువారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్లకు 55 మందిని అర్హులుగా గుర్తించింది. 13 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేసింది. రేషన్‌కార్డులకు 35 మందిని గుర్తించి 18 మందికి పత్రాలు అందించింది. ఆత్మీయ భరోసాలో 46 కుటుంబాలకు అర్హత ఉన్నప్పటికీ కొర్రీల కారణంగా కేవలం 22 కుటుంబాలకే వర్తింపజేసింది. ఇంకా 24 కుటుంబాలకు ఎగనామం పెట్టింది.
ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని కాంగ్రెస్ చెప్పుకుంటున్నప్పటికీ పేదలకు మాత్రమే అన్యాయమే జరుగుతోంది. మా తండలో భూమిలేని నిరుపేదలకు పథకాలేమీ రాలేదు. రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకున్నాం. అదీ రాలేదు. గత మూడేళ్లుగా కరువు (ఉపాధి హామీ) పనికి వెళ్తూనే ఉన్నాను. మాకు సెంటు భూమి కూడా లేదు. కానీ మాకు ఆత్మీయ భరోసా రాలేదు.
-గుగులోత్ మౌనిక, ఏలువారిగూడెం
మా ఊళ్లో అనేకమంది పేద గిరిజనులకు ఆత్మీయ భరోసా పథకం రాలేదు. పేదలకు ఇచ్చే పథకాలకు ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనికి వెళ్లి ఉండాలని అధికారులు చెబుతున్నారు. నేను అంతకన్నా తక్కువ రోజులు పనిచేశానని చెబుతూ నాకు ఈ పథకాన్ని వర్తింపజేయలేదు.
-గుగులోత్ సునీత, ఏలువారిగూడెం