వైరాటౌన్, ఏప్రిల్ 28 : తరుగు తీయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రైతు సంఘాలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు భాగం హేమంతరావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందన్నారు.
వైరా మార్కెట్లో 20 రోజుల నుంచి ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, క్వింటాకు 5 కేజీల చొప్పున తరుగు తీయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. కాగా.. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి ముజామిల్ ఖాన్, ఎస్సై భాగ్యరాజ్ అక్కడికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు.
విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, తరుగు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు, రైతులు హరివెంకటేశ్వరరావు, ఎస్కే సైదులు, కామినేని రవి, బెజవాడ నాగేశ్వరరావు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు భూక్యా వీరభద్రం, దండి సురేశ్, సింగ్ నరసింహారావు, జితేంద్రరెడ్డి, తోట రామాంజనేయులు, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.