కూసుమంచి, ఏప్రిల్ 4: ఖమ్మం జిల్లాలోని పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పదిరోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని కూసుమంచి మండల రైతులు ఆదివారం ఆందోళనబాట పట్టారు. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు తీవ్ర ఆలస్యమవుతున్నాయని, కొన్నవాటికి లారీలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అకాల వర్షాల కారణంగా రైతులు నిద్ర లేకుండా గడుపుతున్నారన్నారు. గాలికి పట్టాలు లేచిపోయి వర్షానికి ధాన్యం తడిసిపోతున్నదన్నారు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు రాస్తారోకో విరమించేదిలేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న కూసుమంచి ఎస్సై నాగరాజు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. లారీలను వెంటనే పంపిస్తామని, కాంటాలు వేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో దాసరి వెంకటేశ్వర్లు, బత్తుల నరసయ్య, నాగిరెడ్డి నారాయణరెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.