అశ్వారావుపేట, ఏప్రిల్ 20 : ఉపాధిహామీ కూలీల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేసి, పాత పథకాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలతోపాటు వేసవి భత్యం చెల్లించాలని, రోజుకు కనీస వేతనం రూ.600 చొప్పున ఇవ్వాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు, గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సోడెం ప్రసాద్, మడకం నాగేశ్వరరావు, మడిపల్లి వెంకటేశ్వరరావు, మాడి నాగేశ్వరరావు, రాజబాబు, సత్యావతి, కాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.