పంట చేల వద్దకు వెళ్లిన మాదిరిగా తెల్లవారకముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్లకొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక లేకపోవడంతో ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకాల ప్రతులు వరుసలో పెట్టి చెట్ల నీడన సేద తీరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు సొసైటీ కార్యాలయాల వద్ద రైతులకు నిత్య తంతులా మారింది. ఒక్క బస్తా దొరకక రైతులు రోజులకొద్దీ తిరుగుతున్న ఘటనలు ఉన్నాయి. తీరా అదును దాటిన తర్వాత పంటకు యూరియా వేసి దండగ అంటూ కడుపు మండిన రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు.
తల్లాడ/టేకులపల్లి/ఇల్లెందు/ వేంసూరు, సెప్టెంబర్11 : రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరు తూ రైతు సంఘం ఆధ్వర్యంలో తల్లాడ మండలం కుర్నవల్లి సొసైటీ కార్యాలయం ఎదుట గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అదును దాటకముందే రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలని, అలాగే కౌలు రైతులకు కూడా ఓపీఎస్ ద్వారా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఐలూరి రామిరెడ్డి, కట్ట దుర్గారావు, బత్తుల కోటేశ్వరరావు, ఎక్కిరాల పుల్లయ్య, ఐలూరి సత్యనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కఠారి కృష్ణ, రైతులు పాల్గొన్నారు.
టేకులపల్లి మండలం బేతంపూడి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు పడిగాపులు కాశారు. తెల్లవారుజూమున వచ్చి క్యూలో నిల్చొ ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం, అధికారులు స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు సొసైటీ గోడౌన్ వద్దకు యూరి యా కోసం రైతులు భారీగా తరలివచ్చారు.
రెండు రోజుల క్రితం కూపన్లు తీసుకున్న రైతులు రావడంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల రోజంతా పడిగాపులు కాయాల్సి వచ్చిందని పలువురు రైతులు, మహిళా రైతులు వాపోయారు. వేంసూరు మండలం అమ్మపాలెం సొసైటీకి సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో బస్తాల కోసం వచ్చిన రైతులు నానా అవస్థలు పడ్డారు. సొసైటీ పరిధిలో ఎక్కువ మంది రైతులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారికి ఇచ్చేందుకు సొసైటీ మొగ్గు చూపడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్థానిక రైతులు తమకే ముందు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సొసైటీ సిబ్బంది వారిని సమన్వయం చేసి యూరియా పంపిణీ చేశారు.