భారత పత్తి సంస్థ(సీసీఐ)కు పత్తిని అమ్మేందుకే రైతులు విముఖత చూపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ కొర్రీలు పెడుతుండటంతో విసిగివేసారి ప్రైవేటు బాట పడుతున్నారు. కొందరు జిన్నింగ్ మిల్లులకే విక్రయించి నిరాశతో వెనుదిరుగుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలోనే అత్యధికంగా పత్తిని విక్రయిస్తున్నారు. దీంతో పత్తి రైతులు దళారుల చేతిలో చిక్కి శల్యమవుతున్నారు. ఫలితంగా సీసీఐ కేంద్రాలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి.
– రఘునాథపాలెం, నవంబర్ 11
ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లులు కేంద్రాలుగా భారత పత్తి సంస్థ(సీసీఐ) పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటా ఒక్కంటికి రూ.8,110 ప్రకటించింది. కానీ సీసీఐ కేంద్రాలకు రైతుల నుంచి ఆదరణ కరువైంది. ప్రభుత్వ మద్దతు ధర అందించకుండా సీసీఐ కొర్రీలు పెడుతూ తీవ్ర ఇబ్బంది పెడుతుండడంతో రైతులు విసిగిపోయారు. దీంతో వ్యవసాయ మార్కెట్లలో ప్రైవేట్ వ్యక్తులకు పత్తిని అమ్ముకుంటున్నారు. కొందరు జిన్నింగ్ మిల్లులకే విక్రయిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి పంట సాగైంది.
భారీ వర్షాలు, మొంథా తుపాన్, వరదలు కారణంగా పత్తి పంట ఎర్రబారి, పత్తి నల్లబడటంతో దిగుబడి పూర్తిగా తగ్గింది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అయితే దిగుబడి తగ్గితే.. ధర పెరుగుతుందనుకున్న అన్నదాతల ఆశలపై సీసీఐ నీళ్లు చల్లింది. మద్దతు ధర రూ.8,110 ప్రకటించడంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’ యాప్ అన్నదాతలకు శాపంగా మారింది. దళారులకు మాత్రం వరంగా మారింది. సీసీఐ లేనిపోని నిబంధనలు పెట్టడంతో అన్నదాతలు తట్టుకోలేక ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగా సాగుతున్నాయి.

‘ప్రైవేటు’ను ప్రోత్సహిస్తున్న వైనం..
పత్తి రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ఆ దిశగా అధికారులు రైతులకు అవగాహన కల్పించి సీసీఐ కేంద్రాలకే పత్తిని తరలించేలా చర్యలు తీసుకోలేదు. సీసీఐ కేంద్రాలకు కాకుండా వ్యవసాయ మార్కెట్లలో దళారులకు విక్రయించేందుకు పత్తి రైతులు వెళ్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు నిత్యం పత్తి భారీగా తరలుతోంది. అధికారులు ప్రైవేటు వ్యాపారుల కోసం మార్కెట్ గేట్లు బార్లా తెరవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
అధికారుల ప్రోత్సాహం మెండుగా ఉండటంతో వ్యాపారులు పత్తి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. చెప్పిందే ధర.. చేసిందే శాసనం అన్నట్లుగా నట్టేట ముంచుతున్నారు. జెండా పాటను రూ.7 వేలు దాటినివ్వడం లేదు. జెండాపాటను సైతం లెక్క చేయకుండా వ్యాపారులు తేమ శాతం పేరుతో రూ.6 వేల నుంచి రూ.6,500లోపే కొనుగోలు చేస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దీంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అత్యధికంగా పత్తి ప్రైవేటుబాట పడుతోంది. ఇక దళారులు గ్రామాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను నేరుగా సీసీఐ కేంద్రాలకు తరలించి అత్యధిక ధరకు విక్రయించి రైతుల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు.
పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి

ఖమ్మం రూరల్, నవంబర్ 11 : సీసీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. పొన్నెకల్ జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు విక్రయానికి తెచ్చిన పంటలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అకాల వర్షాలతో పత్తి పంట దెబ్బతిన్నదని, గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు పంట తీసుకొచ్చిన రోజునే కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. 12 శాతం తేమ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. పత్తి రైతులతోపాటు కౌలు రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీం, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఏవో ఉమానగేష్, మద్దులపల్లి ఏఎంసీ సెక్రటరీ పి.వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.