‘సెక్యులర్ భావాలు కలిగిన ప్రజలు ఖమ్మం నగరవాసులు.. ఇక్కడ మతోన్మాద శక్తుల ఎత్తులు పారవు.. మత ఘర్షణలకు తావు లేదు.. నగరంలో సర్వమత సమానత్వం పరిఢవిల్లుతున్నది.. బీఆర్ఎస్ అనుసరిస్తున్న సెక్యులర్ విధానాలే ప్రజలకు శ్రీరామరక్ష.. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సోదరభావంతో మెలుగుతున్నారు.. ముస్లిం మైనార్టీలు కేసీఆర్ వెంటే ఉన్నారు’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో సోమవారం నిర్వహించిన ‘ముస్లింల ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. మసీదులను కూల్చుతామని బెదిరిస్తున్న శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 38వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. అప్పటికప్పుడు స్థానిక సమస్యలకు పరిష్కారం చూపారు.
ఖమ్మం, జనవరి 2: సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు. ఖమ్మంలోని షాదీఖానాలో సోమవారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సెక్యులర్ విధానాలను వదులుకోబోదని స్పష్టం చేశారు.
యావత్ తెలంగాణలోనే ఖమ్మానికి ప్రత్యేక స్థానం ఉందని, హైదరాబాద్ లాంటి చోట్ల మత ఘర్షణలు జరిగిన సందర్భాల్లో కూడా ఖమ్మంలో ఏ ఒక్క సంఘటన కూడా చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. ఖమ్మంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని, సెక్యులర్ భావాలు కలిగిన వారు ఇక్కడ ఎక్కువని అన్నారు. రజబ్అలీ లాంటి మైనార్టీ నేతను కూడా గెలిపించిన ఘనత ఖమ్మం ప్రజలకు ఉందని గుర్తుచేశారు. తెలంగాణలో మైనార్టీలందరూ బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఖమ్మం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా అఫ్జల్మియాను నియమిస్తున్నామన్నారు. కేఎంసీ ఎన్నికల్లో 54 డివిజన్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తే అందులో ఐదు చోట్ల మైనార్టీలు గెలుపొందారని గుర్తుచేశారు.
మసీదులను కూల్చుతామని బెదిరిస్తూ మతోన్మాదంతో రాజకీయం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చూడడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణ సమాజం భద్రంగా ఉంటుందని అన్నారు. అనంతరం షాదీఖానాలో ముస్లిం మైనార్టీలతో కలిసి భోజనం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, మైనార్టీ నాయకులు ఫాతిమా జోహారా ముక్తార్, షౌకత్ అలీ, మక్బుల్, ఖమర్, తాజుద్దీన్, అష్రిఫ్, ఇషాక్, జిలాని, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, లక్ష్మీప్రసన్న, షకీనా, తన్నీరు శోభారాణి, మహ్మద్ అలీ, జహీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.