ఖమ్మం రూరల్, మే 14 : స్ట్రాంగ్ రూంలకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. రూరల్ మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంల తరలింపు ప్రక్రియను పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జీ కోల్టేతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట, అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ అర్ధరాత్రి వరకు తరలించి స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామన్నారు. ఈ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా జరిగిందన్నారు.
ఈవీఎంలకు మూడంచెల భద్రత కల్పించామని, సీఆర్పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు భద్రతగా నిరంతరం కాపలా ఉంటారన్నారు. స్ట్రాంగ్‌రూంలకు అన్ని వైపులా సీసీ కెమెరాలు, టెర్రస్‌పై నైట్ విజన్ కెమెరాలు అమర్చామన్నారు. అంతరాయం లేకుండా సీసీ కెమెరాలు పని చేయడానికి పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు వచ్చి టెలివిజన్‌లో సీసీ కెమెరాలను పరిశీలించవచ్చని, పాస్‌లు ఉన్నవారు మాత్రమే స్ట్రాంగ్‌రూంల వద్దకు వెళ్లి పర్యవేక్షణ చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సహాయ ఎన్నికల అధికారులు ఆదర్శ్ సురభి, బీ.సత్యప్రసాద్, వేణుగోపాల్, ఎం.రాజేశ్వరి, గణేశ్, రాజేందర్, మధు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.