మామిళ్లగూడెం, మే 14 : ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి సోమవారం అర్ధరాత్రి పొన్నేకల్లులో గల శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రానికి చేరిన ఈవీఎంలను పటిష్ఠ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా నడుమ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నెల రోజులపాటు నిరంతరం ప్రజలతో మమేకమై.. ఊరూరా.. వాడవాడలా విస్తృతంగా ప్రచారం చేసి.. ఓట్లు అభ్యర్థించిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అంతేకాక ఈవీఎంలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. అయితే ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రమైన ఎండను లెక్క చేయకుండా గెలుపే ప్రధానంగా నిరంతరం శ్రమించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎవరికి వారు తమ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. ఓటింగ్ సరళి, పట్టణ ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఏ పార్టీకి లాభం.. నష్టం చేకూరుతుందో అనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. మరో పక్క పందెంరాయుళ్లు మాత్రం గెలుపు ఓటములను బేరీజు వేస్తూ.. గెలిచినా మెజార్టీ వంటి అంశాలపై బెట్టింగ్‌లు కట్టే పనిలో తలమునకలయ్యారు.
నియోజకవర్గంలోని 1,896 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,87,160, మహిళలు 8,43,749, ట్రాన్‌జెండర్లు 130 మంది ఉన్నారు. అయితే సోమవారం జరిగిన పోలింగ్‌లో 12,41,135 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 6,05,969 మంది, స్త్రీలు 6,35,099, ట్రాన్‌జెండర్లు 67 మంది ఉన్నారు. మొత్తంగా 76.09 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి కూడా ఖమ్మం అసెంబ్లీ పరిధిలో 3,24,073 మంది ఓటర్లు ఉండగా.. కేవలం 2,04,078 మంది మాత్రమే ఓటు వేయడంతో 62.97 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. దీని తర్వాత స్థానంలో కొత్తగూడెం అసెంబ్లీలో 2,47,494 మంది ఓటర్లు ఉన్నప్పటికి 1,71,928 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 69.47 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,40,806 మంది ఓటర్లు ఉండగా.. 2,01,721 మంది ఓటర్లు ఓటు వేశారు. 83.77 శాతం పోలింగ్ నమోదైంది. మధిర నియోజకవర్గంలో 2,22,160 మంది ఓటర్లు ఉంటే.. 1,81,815 మంది ఓటు వేశారు. 81.84 శాతం ఓటింగ్ నమోదైంది. వైరా నియోజకవర్గంలో 1,93,389 మంది ఓటర్లు ఉండగా.. 1,56,762 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.06 శాతం పోలింగ్ నమోదైంది. సత్తుపల్లి నియోజకవర్గంలో 2,43,943 మంది ఓటర్లు ఉంటే.. 1,95,979 మంది ఓట్లు వేయడంతో 80.34 శాతం పోలింగ్ నమోదైంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,59,174 మంది ఓటర్లకు.. 1,28,852 మంది ఓట్లు వేయడంతో 80.95 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లెక్కల ప్రకారం అన్ని సెగ్మెంట్లలో గ్రామీణ ఓటింగ్ శాతం పెరడంతో అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.