
చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, తిర్లాపురం తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీ, డంపింగ్యార్డు, పల్లెపకృతివనాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె ఆయా శాఖల సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొదటగా లచ్చగూడెం గ్రామంలో గత వేసవి సీజన్లో నిర్వహించిన ఈజీఎస్ పనుల రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం తిర్లాపురం గ్రామంలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ధేశించిన హరితహారం లక్ష్యాన్ని గ్రామాల్లో కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులు, వనసేవకులు, సిబ్బంది సమిష్టిగా చేరుకోవాలని, పల్లెప్రగతి లక్ష్యాలను చేరుకోనేలా గ్రామస్ధాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. ఇప్పటివరకూ నాటిన మొక్కల పెంపకంలో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు ఉంటాయని, గ్రామంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటేలా గ్రామస్ధాయిలో కార్యచరణ రూపోందించుకోని పటిష్టంగా అమలు చేయాలని కార్యదర్శులకు సూచించారు.