కూసుమంచి, ఏప్రిల్ 17 : మండు వేసవిలోనూ పాలేరు జలాశయంలో జలకళ ఉట్టిపడుతున్నది. ఎండ తీవ్రత పెరగడం, సాగర్ ఆయకట్టు కింద వరికోతలు పూర్తికావడం సహజంగా ఈ సమయంలో పాలేరు నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మధ్య ఉంటుంది.. కానీ సోమవారం 22.75 అడుగులకు చేరుకున్నది. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు. జిల్లాలో యాసంగి పంటలకు పాలేరు కింద 17 మండలాల్లో 2.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. ప్రస్తుతం పాలేరు ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో తక్కువగా ఉండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. సోమవారం సాగర్ నుంచి 3,912 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా పాలేరు నుంచి 2,455 క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువకు వదిలారు. పాలేరు చానల్‌కు నీటిని నిలిపివేశారు.
ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాలకు తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరధ ద్వారా 125 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 2.55 టీఎంసీల నీటి సామర్థ్యం గల పాలేరు నుంచి వేసవిలో మూడు జిల్లాల్లోని సుమారు 30 మండలాలకు తాగునీటిని మిషన్ భగీరధ ద్వారా అందజేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 23 అడుగులకు చేరుకోనున్నది.