ఖమ్మం/ బూర్గంపహాడ్, డిసెంబర్ 26 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు; ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అప్రజాస్వామికమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, సత్తుపల్లి, వైరా మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ చంద్రావతి అన్నారు. అతడి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసూ అందజేయకుండా ఆయనను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. గురువారం ఉదయమే పోలీసులు అతడి ఇంటి వద్దకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగానే సెలవు రోజుల్లో తమ పార్టీ నేతలను అరెస్టు చేయిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ఈ పైశాచిక ఆనందం ఎక్కువకాలం నిలవదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, అరెస్టులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుచెప్పారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ పోలీసు రాజ్యంలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ సమాజమే తగిన బుద్ధిచెబుతుందని స్పష్టం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.