ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 5 : ఆ పాఠశాలలో అన్ని సౌకర్యాలున్నా.. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండేది. ఆంగ్ల మాధ్యమం కోసం ఆ గ్రామ విద్యార్థులు ప్రైవేట్ బాట పట్టారు. ఇక బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఖమ్మం నగరానికి కూతవేటు దూరం ఉన్న రూరల్ మండలం బారుగూడెంలోని సర్కార్ బడి ఉపాధ్యాయుల కృషి, ఆంగ్ల మాధ్యమ బోధనతో ఆయువు పోసుకుంటున్నది.
ప్రాథమిక పాఠశాల అయినా ప్రైవేట్‌కు దీటుగా బోధన అందుతున్నది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకే పాఠశాలలో బోధన నిర్వహిస్తారు. 2016 సంవత్సరానికి ముందు 40 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉండేవారు. 2016లో ఇంగ్లిష్ మీడియంలో బోధించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తొలుత 1వ తరగతిలో మాత్రమే ఇంగ్లిష్ మీడియం అమలు చేశారు. అదే ఏడాది 16 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. తర్వాత ఇతర తరగతులకు ఇంగ్లిష్ మీడియాన్ని వర్తింపజేశారు. ఆశించినట్లుగానే 2021-22 విద్యాసంవత్సరంలో పాఠశాలలో 92 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బారుగూడెం సమీప గ్రామాలు సీతారాంపురం, కొండాపురం, శ్రీసిటీ నుంచి విద్యార్థులు హాజరువుతున్నారు. నాలుగైదు కిలోమీటర్ల నుంచి పిల్లలు వస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాలలో సందడి వాతావరణం కనిపిస్తున్నది. పాఠశాల రక్షణకు అనువుగా చుట్టూ ప్రహరీ ఉంది. ఆర్చీ, ద్వారం (గేట్) కూడా సమకూర్చారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పాఠశాలలోనే వండుతున్నారు. విద్యార్థులకు తాగునీరు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల ఆవరణలో పూల, పండ్ల, టేకు మొక్కలు నాటారు.
ఉపాధ్యాయుల నిరంతర కృషితో పాఠశాలలో అద్భుత ఫలితాలొస్తున్నాయి. ప్రతి సంవత్సరం గురుకుల, నవోదయ పరీక్షలు రాసిన విద్యార్థులు సీటు సాధించడం ఇందుకు నిదర్శనం. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా వినూత్నంగా బోధిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పి, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కనబర్చేలా గోడలపై పాఠ్యాంశాల బొమ్మలు గీయించారు. విద్యార్థులు సులభంగా నేర్చుకునేలా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ‘మన ఊరు – మన బడి’ ద్వారా అమలు చేయనున్న ఇంగ్లిష్ మీడియం చదువుకే తల్లిదండ్రులు ఓటు వేశారని చెప్పడానికి బారుగూడెం పాఠశాలే సాక్ష్యం. ఆంగ్ల మాధ్యమంలోనే విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది.
ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత అడ్మిషన్లు పెరిగాయి. ఆంగ్ల మాధ్యమంతో చుట్టూ పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు మా పాఠశాలలో ప్రవేశాలు పొందుతున్నారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని తమ పాఠశాలకు వర్తింపజేస్తే అదనపు తరగతి గదులు మంజూరవుతాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏసీఆర్లుంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.
– చావా రమణ, ప్రధానోపాధ్యాయురాలు
ఇంగ్లిష్ మీడియంతో పాఠశాలకు కొత్త కళ వచ్చింది. ముగ్గురు మహిళా ఉపాధ్యాయురాళ్లు విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ఇంకా ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులకు గ్రామ పంచాయతీ నుంచి సహకారం అందిస్తున్నాం. స్కావెంజర్‌ను నియమించాం.
– పల్లెర్ల పాండయ్య, బారుగూడెం సర్పంచ్