ఇల్లెందు రూరల్, మే 24 : దేశానికి వెలుగులు పంచిన బొగ్గుట్ట మనుగడ కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు అబ్దుల్నబీ, సారయ్య, వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్, క్లింట్ రోజ్, రాంసింగ్ అన్నారు. శనివారం ఇల్లెందులోని సింగరేణి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట పూసపల్లి ఓసీ నిర్వాసితులతో కలిసి ధర్నా నిర్వహించి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏరియా జీఎం కృష్ణయ్యకు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాస పరిహారం చెల్లించాలన్నారు. ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని సింగరేణి చేపట్టాలని, తాగునీరు, పారిశుధ్యం రోడ్డు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు ప్రజల మనుగడ కోసం నూతన పూసపల్లి ఓసీని త్వరగా ప్రారంభించాలన్నారు.
పూసపల్లి ఓసీ అందుబాటులోకి వస్తే ఇల్లెందులో ఉన్న నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. బొగ్గుట్ట మనుగడ కోసం పార్టీలకతీతంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మొగిలి నర్సయ్య, మహేష్, బాలు సత్యనారాయణ, తాళ్లూరి కృష్ణ, రాజు, విజయ్, సారంగపాణి, హరిసింగ్, యాదగిరి, సత్యం, రాజు, సదా మహేష్ పాల్గొన్నారు.