షేక్ గాలిబ్బి కడు పేదరాలు. ఈమెది చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్ గ్రామం. భర్తతో కలిసి కూలి పనులకు వెళ్తేనే పూటగడుస్తుంది. పిల్లలు వేరే ఉంటున్నారు. వ్యవసాయ కూలి పనులు చేయలేక ఉపాధి పనులకు వెళ్తున్నది. పని అయితే చేస్తున్నది కానీ.. రెండు నెలలుగా ఇంతవరకు కూలి సొమ్ములు రాలేదు. దీంతో పనిచేస్తూ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి ఆ కుటుంబానిది.
అసలే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. చేతిలో పైసలు లేక పచ్చడి మెతుకులు తిని బతుకుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉందని గాలిబ్బి ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇది ఈమె ఒక్క కుటుంబానిదే కాదు.. జిల్లాలో చాలామంది కుటుంబాల పరిస్థితి ఇలానే ఉంది. ఉపాధి పనికి వెళ్తున్నప్పటికీ ఎన్నో కుటుంబాలు కరువులో కొట్టుమిట్టాడుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారిపోతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోవడం లేదు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)
పేదలకు కూలి పనులు లేని సమయంలో పనులు కల్పించి ఉపాధి కల్పించడమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రధాన ఉద్దేశం. కానీ.. ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదు. పనులు చేయించుకుంటున్నారు.. కానీ.. కూలి సొమ్ములు మాత్రం ఇవ్వడంలేదు. దీంతో ఉపాధిహామీ పనులపై కూలీలకు పూర్తిగా నమ్మకంపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,35,000 జాబ్‌కార్డులు ఉండగా.. అందులో ఉపాధి కూలీలు 2,14,776 మంది నమోదయ్యారు. కానీ.. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో 22 మండలాల్లో ఉపాధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో 36,020 మంది మాత్రమే ఉపాధి పనులు చేస్తున్నారు. రైతుల అవసరాలకు ఉపయోగపడే పనులు, సాగునీటి సంరక్షణ పనులపై కలెక్టర్ దృష్టి పెట్టడంతో అలాంటి పనులను మాత్రమే ఎంపిక చేశారు. దీంతో ఉపాధి కూలీలు ఫాంపాండ్, పొలం గట్లు, సోక్పిట్లు, ట్రెంచ్ కటింగ్ పనులు చేస్తున్నారు.
వేసవికాలంలో పనులు అంటేనే ఎవరైనా వెనుకంజ వేస్తారు. ఉపాధి పనుల వద్ద నీడ లేకపోవడంతో ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. ఉపాధిహామీ పనుల వద్ద కూలీలకు పంచాయతీ సిబ్బంది టెంట్లు వేయాల్సి ఉండగా ఎక్కడా నీడ సౌకర్యాన్ని కల్పించిన దాఖలాలు కనబడడం లేదు. అటవీ ప్రాంతంలో చేసే ట్రెంచ్ కటింగ్ పనుల వద్ద కూడా నీడ సౌకర్యాన్ని అధికారులు కల్పించడం లేదు. దీంతో కూలీలు ఎండలకు తట్టుకోలేక ముందుగానే ఇంటిముఖం పడుతున్నారు. ఎండలో సైతం పనులు చేస్తున్నప్పటికీ కూలి డబ్బులు సకాలంలో చెల్లించేందుకు అధికారులు కనికరం చూపడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు.
వేసవికాలంలో ఉపాధిహామీ పనులు చేస్తే గతంలో బోనస్ ఇచ్చేవారు. కానీ.. ఈసారి బోనస్ ముచ్చట లేకపోవడం కాదు.. కనీసం కూలి సొమ్ములు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కూలీలు హైరానా పడుతున్నారు. మండుటెండలో పనిచేస్తుంటే బోనస్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.