పెనుబల్లి/అశ్వారావుపేట రూరల్, జూన్ 20 : పదేళ్ల కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకున్నారు. సాగును సంబురంగా చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే తడవుగా విద్యుత్ కోతలు పెట్టడమే పనిగా పెట్టుకున్నది. రైతులు పంట చేల వద్ద విద్యుత్ కోసం రేయింబవళ్లు పడిగాపులు కాసేలా చేసింది. పంటలను ఎండిపోయేలా చేసింది. రైతులను మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టింది. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థంకాని పరిస్థితులను తీసుకొచ్చింది. మళ్లీ పాత రోజులే వచ్చాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది కూడా ఇలాగే కోతలు పెడితే పంటలు ఎలా పండించుకోవాలని దిగులు చెందుతున్నారు. గత కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు అందించిన కరెంటునే రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మోటర్ల వద్ద అర్ధరాత్రులు కాపలా పడుకున్నాం. ఏ సమయంలో కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో బోరుబావుల వద్ద ఎదురు చూసేవాళ్లం. తెలంగాణ ఏర్పడి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించడం వల్ల రాత్రులు కాపలా పోయింది. నిరంతర విద్యుత్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం సక్రమంగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు గంటకు రెండుసార్లు విద్యుత్ అంతరాయం, ఎటువంటి ఇబ్బందులు లేకున్నా సరే ఏదో ఒక సాకుతో కరెంటు కట్ చేస్తున్నారు. దీంతో రైతులు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది.
– కోమటి ప్రసాద్, బయ్యన్నగూడెం, రైతు
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో పదేళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ ఇవ్వడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది. కానీ.. ఇటీవలి కాలంలో కొద్దిపాటి చినుకులు పడినా, గాలి దుమ్ము వచ్చినా విద్యుత్ అంతరాయమే. ఒక్కోసారి ఎటువంటి ఇబ్బంది లేకున్నా కరెంట్ పోవడంతో ఏ సమయంలో కరెంట్ వస్తుందో.. పోతుందో.. తెలియని పరిస్థితి ఉంది. విద్యుత్‌పై నిరంతరం ఆధారపడి పని చేసుకునే వారికి కరెంట్ కష్టాలు తప్పవన్నట్లుగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే వర్షాకాలంలో వర్షాలకు విద్యుత్ అంతరాయం ఏ విధంగా ఉంటుందో అర్థం కావడం లేదు. చిమ్మ చీకట్ల నుంచి తెలంగాణ వచ్చాక వెలుగులు నింపి.. మళ్లీ చీకట్లో పడినట్లు అవుతుంది.
– వేముల నరేంద్ర, ఎలక్ట్రీషియన్, వీఎం బంజర
కరెంటు తరచూ వస్తూ.. పోతుండడంతో ఇబ్బందిగా ఉంది. రాత్రి పూట సరిగా నిద్ర కూడా ఉండటం లేదు. ఎన్నిసార్లు వస్తుందో.. పోతుందో తెలియదు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంత ఇబ్బంది పడలేదు. కరెంటు పోయిన వెంటనే మళ్లీ వచ్చేది. పశువుల మేత కోసం వేసిన గడ్డికి కరెంటు సరిగా లేకపోవడంతో నీరందక ఎండిపోయింది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో ఆ గడ్డికి మళ్లీ ప్రాణం వచ్చినైట్లెంది. కరెంటు సక్రమంగా లేకపోవడం వల్ల అవస్థలు పడుతున్నాం. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.
– నాగేశ్వరరావు, అశ్వారావుపేట