భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : మొన్నటి వరకు పల్లెల్లో నెలకొన్న రాజకీయ వేడి చల్లారక ముందే మళ్లీ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకోనుంది. ఇప్పటికే పల్లె ఓటర్ల నుంచి పరాభవాన్ని ఎదుర్కొన్న అధికార పార్టీ.. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనైనా ఓటర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తోంది. ఈ ఆలోచనతోనే పట్టణ ఎన్నికలకు తహతహలాడుతోంది. ఇందుకోసం ముందస్తుగానే మున్సిపల్ ఎన్నికల నగారాకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఈ నెలాఖరు కల్లా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పించే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అధికారులు సైతం అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. ముసాయిదాను జాబితాను కూడా ఇప్పటికే ప్రచురించి ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంచారు. ఇదేగాక, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అదే క్రమంలో ఎన్నికల సంఘం కూడా అధికారులతో వీసీ ద్వారా సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో పురపాలక ఎన్నికలకు నగారా మోగడం ఖాయమంటూ జనాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నెల చివరిక కల్లా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ముందస్తు సమాచారం అధికారులకు రావడంతో వారు ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో గతంలో కొత్తగూడెం పట్టణం మున్సిపాలిటీగా ఉండేది. అయితే, జంట పట్టణంగా పొరుగునే ఉన్న పాల్వంచ మున్సిపాలిటీని, సుజాతనగర్ మండలంలోని కొన్ని గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెంలో విలీనం చేసి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసింది.
దీంతో భద్రాద్రి జిల్లాలో ఇది ఏకైక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించినట్లయింది. దీంతోపాటు అశ్వారావుపేట పట్టణానికి ఆనుకొని ఉన్న సమీప గ్రామాలను పట్టణంలో విలీనం చేసి అశ్వారావుపేటను కూడా మున్సిపాలిటీగా ప్రకటించింది. దీంతో జిల్లాలో కొత్తగా అశ్వారావుపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీకి యథావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తంగా జిల్లాలో మూడు చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
పురపాలక నగారా మోగనుందనే సమాచారంతో అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రతి రోజూ ఆయా మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ముందుగా రాజకీయ పార్టీల నాయకులతో డివిజన్‌స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఐడీవోసీ (కలెక్టరేట్)లో జిల్లాస్థాయిలోనూ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10న మున్సిపల్ ఓటర్ల తుది జాబితా ప్రకటించాక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో 180 పోలింగ్ కేంద్రాలను గుర్తించి పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక పూర్తి ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పటికే పట్టణ ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించాం. ఓటర్ల జాబితాలో సవరణలు ఉంటే తెలియజేయాలని ఆయా పార్టీల నేతలకు సూచించాం. ఈ నెల 10న తుది జాబితా ప్రకటిస్తాం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులకు గాను 180 పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. రాజకీయ నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఏర్పాటుచేస్తారు.
-సుజాత, కమిషనర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్