కవాడిగూడ, మార్చి 15: రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నదని, యూపీ సీఎం యోగిలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో పేదల ఇండ్లను కూల్చివేస్తూ.. జూనియర్ యోగిలా మారారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో ఆదివారం భోలక్‌పూర్ అంజుమన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, సీనియర్ నాయకుడు ఎం.ఎన్. శ్రీనివాసరావు, యువనాయకుడు ముఠా జయసింహలతో కలిసి ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు.
కేసీఆర్ కిట్ ఏమైంది?
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి సబ్ ప్లాన్ కమిటీ ఏర్పాటు చేసి నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ కిట్ ఎందుకు మాయమైందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పాలనలో స్కాములు తప్ప.. స్కీములు లేకుండా పోయాయన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకున్న నేత కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల హరిబాబుయాదవ్, వల్లాల శ్యామ్యాదవ్, రాకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.