వనపర్తి, మార్చి 15(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు తానా అంటే తందానా అంటూ వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. నాయకుల సంతోషం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టే సంస్కృతిని అమలు చేస్తున్న పోలీస్ అధికారులు పునరాలోచించుకోవాలని సూచించారు. ఆదివారం వనపర్తిలోని తన నివాసంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటిశ్రీధర్లతో కలిసి సింగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయని పథకాలను ప్రశ్నించినా…సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అమలు చేయని పథకాలు, హామీలపై నాయకులను ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులు నిలువరించే పనులు చేయడం సరికాదని, కేవలం రక్షణ కల్పించడమే పోలీసుల పని అని అన్నారు. అధికారులు, నాయకులను ప్రశ్నించే ప్రజల పక్షాన పోలీసులు నిలబడాలని, కేవలం రాజకీయ నాయకుల కొమ్ము కాయవద్దన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయనప్పుడు ప్రశ్నించడం ప్రజల హక్కు అని, అవసరమైతే జనం తిరుగుబాటు కూడా చేస్తారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటికే ఐదు రైతు భరోసాలు ఇవ్వాల్సి ఉందని, వీటిలో అసంపూర్తిగా రెండు మాత్రమే ఇచ్చారన్నారు. ఇంకా మరో మూడు రైతు భరోసాలు మొత్తానికే పెండింగ్ పెట్టారన్నారు. మున్సిపల్ ఎ న్నికల ముందు రూ.9వేల కోట్లు రైతు భరోసా నిధులు సిద్ధంగా ఉన్నాయని ఓటర్లకు ఊరట కలిగించి మోసం చేశారన్నారు. ఇప్పుడు..అప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని, సీజన్ దాటిపోయినా భరోసాకు ఎగనామం పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతులకు కరంట్, యూరియా సరఫరా సక్రమంగా లేనందునా తీవ్రంగా నష్టాలపాలవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను వివిధ పథకాల పేరుతో మోసం చేయడానికి ప్రమాణాలు చేసిన మొదటి సీఎంగా రేవంత్ మొదటి స్థానంలో నిలిచిపోయాడని ఎద్దేవా చేశారు.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసును ఛేదించాలి
రెండున్నరేండ్ల్లుగా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసును ఇప్పటి వరకు ఛేదించకపోవడం విచారకరమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసును ఎందు కు విచారణ పేరుతో పెండింగ్ పెట్టారని, దీనిని ఎవరు ఆపుతున్నారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. హత్య కేసును ఛేదించలేనంత అసమర్థంగా పోలీస్‌శాఖ పనిచేస్తున్నట్లుగా ఉందన్నారు. పోలీస్ శాఖలో చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు ఇలాంటి చర్యలు తలవంపులు తేస్తున్నాయని, వారం రోజుల్లో శ్రీధర్‌రెడ్డి హత్యను ఛేదించని పక్షంలో రాష్ట్ర వాప్త్యంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
మున్సిపాలిటీ పాలనలోనూ ప్రభుత్వం విఫలమైందని, ఎటు చూసినా చెత్తతో పట్టణం నిండిపోయిందన్నారు. అన్ని వసతులతో ఏర్పాటు చేసిన టౌన్‌హాల్‌ను ప్రారంభించకుండా ప్రైవేట్ హాళ్లకు వెళ్లి ప్రభుత్వ మీటింగ్‌లు పెట్టడం శోఛనీయమన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పరంగా మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ప్ర యోజనం లేదన్నారు. ఇరిగేషన్‌పై ఒక్క పూర్తిస్థాయి సమీ క్ష కూడా రెండేళ్లలో నిర్వహించ లేదన్నారు.
రామన్నగట్టు రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేశారని, 7దఫాలు గెలిపించారని చెబుతున్న మంత్రి జూపల్లికి అభివృద్ధిపై దృష్టి లేదని, కేవలం కక్షలు, వేధింపులతోనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డీ-8,డీ-5 కెనాల్స్ పనులను సహితం పెండింగ్ పెట్టారని, 7 టీఎంసీల ఏదుల రిజర్వాయర్‌ను కేవలం రేండేండ్లలోనే పూర్తి చేశామని, 2 టీఎంసీల సా మర్థ్యం ఉన్న రామన్నగట్టు రిజర్వాయర్‌ను పూర్తి చేయకపోవడంపై మంత్రుల అసమర్థత తెలుస్తుందని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా స్కూల్‌ను విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో నిర్మాణం చేయవద్దని, గతంలో మంజూరైన బైపాస్ రోడ్డును పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి వేర్వేరుగా లేఖలను పంపుతున్నట్లు చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, కృష్ణా నాయక్, అశోక్, కరుణశ్రీ, రఘుపతిరెడ్డి, కర్రెస్వామి, మాణిక్యం, తిరుపతయ్య, దిలీప్‌రెడ్డి, గిరి, రాము, శ్రీను పాల్గొన్నారు.