కారేపల్లి,మే 21 : కేవైసీ పేరుతో ప్రభుత్వం వృద్ధులను, వికలాంగులను, వితంతువులను, ఇబ్బందులకు గురిచేస్తుంది.. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) గ్రామపంచాయతీలో వృద్ధులు, దివ్యాంగులు(ఆసరా పెన్షన్ దారులు)కేవైసీ కోసం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకే పంచాయతీ కార్యాలయ ప్రాంగణానికి వచ్చి ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి మాత్రం 11 గంటలు దాటిన ఆఫీసుకు రాలేదు. రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియను కొన్ని రోజులుగా పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తున్నారు.
కొంతమంది పంచాయితీ కార్యదర్శులు దూర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తుండడంతో కేవైసీ చేపించుకునేందుకు పొద్దునే పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్న వృద్ధులు, వికలాంగులు వేసవి తాపానికి విలవిలలాడుతున్నారు. అనేకమంది వృద్ధులు, దివ్యాంగులు ఎక్కడో దూరంలో ఉన్న తమ కుమారులు, కూతుర్ల వద్ద ఉండగా ఎక్కడ తమ పెన్షన్ ఆగిపోతుందో నేమో అనే భయంతో కేవైసీ నమోదు కోసం సొంత గ్రామాలకు చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఎండ తీవ్రత తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.
కారేపల్లికి చెందిన ఓ వృద్ధురాలు పక్షవాతం రావడంతో హైదరాబాదులోని తన కుమారుడి వద్ద ఉంటుంది. కేవైసీ కోసం కారేపల్లి చేరుకుంది. రెండు రోజులు పంచాయితీ కార్యాలయం చుట్టూ తిరిగిన కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. ఇదే క్రమంలో మరికొందరు ఆధార్లో అప్డేట్ చేసుకునేందుకు మీసేవ, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా మండలంలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.
చార్జీలకు డబ్బులు లేక ఎండలోనే అనేకమంది వృద్ధులు, దివ్యాంగులు కాలినడకన పంచాయతీ కార్యాలయానికి చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మంచానికే పరిమితమైన వారు, ప్రత్యేక అవసరాలు కలిగిన వృద్ధులు, దివ్యాంగుల ఇండ్లబడ్డకే వెళ్లి కేవైసీ నమోదు చేయాలని బాధిత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు పంచాయతీ కార్యదర్శులపై దృష్టి సారించి ఇబ్బందులు తలెత్తకుండా కేవైసీ చేసేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.