Vote From Home |ఏ ఎన్నికల్లోన్నైనా ఓటు హక్కు ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు నుంచే కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటరుగా నమోదు చేయడం.. జాబితాలో మార్పులు, చేర్పులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఈవీఎం యంత్రాల సహాయంతో ఓటు ఎలా వేయాలనే అంశాలనే అవగాహన కల్పించింది. ఈ క్రమంలోనే 80 ఏళ్లు పైబడిన వయసు వారందరూ ఇంటి నుంచే ఓటు వేసే విధంగా తొలిసారిగా వెసులుబాటు కల్పించింది. వయసు సహకరించకపోవడం.. అనారోగ్యంతో ఇంటికే పరిమితమై ఓటు వేయలేకపోయిన వారి కోసం ఈ విధానాన్ని తెచ్చింది. జిల్లాలో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అర్హత గల 36,053 మంది సీనియర్ సిటిజన్లకు ఇదో మంచి అవకాశంగా మారింది. అత్యధికంగా సత్తుపల్లిలో, తక్కువగా పాలేరులో 80 ఏళ్ల వయసు దాటిన వారున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తర్వాత వీరికి 12డీ ఫాంల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ఓటింగ్ శాతం వందకు వంద జరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
కూసుమంచి, అక్టోబర్ 20 : గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోన్నైనా ఓటు హక్కు ఉన్న వృద్ధులు విధిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవారు. అయితే వారు పోలింగ్ కేంద్రాలకు రావడం ఒక ఎత్తయితే.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేయడం పెద్ద ప్రయాసగా మారడంతోపాటు వివిధ రకాల సమస్యలు తలెత్తేవి. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం నెలకొనడం.. ఓటర్లు అభ్యంతరం తెలిపిన సందర్భాలూ ఉన్నాయి. ఎలాగోలా ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధులు తిరిగి ఇంటికి వెళ్లాలంటే నానా యాతన పడేవారు. ఇలాంటి ఇబ్బందులన్నీ గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పరిష్కార మార్గం చూపింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం దరఖాస్తు ఎలా చేయాలి.. సంబంధిత ఫాం ఎలా నింపాలి అనే దానిపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జిల్లావ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు 36,053 మంది ఉండగా.. వీరు ఇంటి నుంచి ఓటు వేసుకునేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారిలో 19,292 మంది వృద్ధులు, 16,761 మంది దివ్యాంగులు ఉన్నారు. సత్తుపల్లిలో అధికంగా 8,756 మందికి అవకాశం లభించనున్నది. ప్రతి ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు వారి సహాయకులు, కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవారు. అయితే ఈసారి ఎన్నికల సంఘం కల్పించిన అవకాశంతో వృద్ధులకు ఇబ్బంది తీరినైట్లెంది.
నామినేషన్ ప్రక్రియ తర్వాత
శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత వెంటనే 80 ఏళ్లు పైడిన వారి కోసం 12 డీ ఫాంల జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. వయసు తదితర కారణాల రీత్యా ఇంటి నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పించాలంటే తప్పనిసరిగా 12 డీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత దరఖాస్తును పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందు బీఎల్వోకు అందజేయాలి. దీనిని ఎన్నికల మొబైల్ టీం పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారుడి అభ్యర్థన, అతడి ఆరోగ్య పరిస్థితులనుబట్టి ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. వారికి బ్యాలెట్ ఓటు విధానంపై శిక్షణ కూడా ఇస్తారు.
నాకు 86 ఏళ్లు. కాళ్ల వాపులతో నడవలేను. ఓటు వేయడానికి వెళ్లాలంటే ప్రతి ఎన్నికల్లో ఇబ్బందులు పడుతున్నా. అక్కడ క్యూలో నిలబడడం.. ఒకరి సహాయం ఉంటేనే ఓటు వేసే పరిస్థితి. మా లాంటి పెద్ద వయస్సు వారికి, ఆరోగ్యం సక్రమంగా లేని వారికి, దివ్యాంగులకు, 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి వద్ద ఉండి ఓటు వేసుకోవచ్చని తెలిసింది. ఇంటికాడి నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పించిన ఎన్నికల సంఘానికి నా నమస్కారం.
నేను నడవలేను. ఇంటి కాడికి ఓటు వస్తది అంటే ఓటు వేస్తా. పోయిన సారి కూడా ఓటు వేయలేదు. పోయేటప్పుడు తీసుక పోతాండ్రు కానీ మళ్లీ తీసుకరావడం లేదు. ఇంటి దగ్గర ఓటు అంటే ఎట్లా వేయాలో తెల్వదు. నా వయస్సు 96 సంవత్సరాలు. రజాకార్ల హడావుడి అప్పటి సంది నాకు ఓట్లు తెలుసు. చాలాసార్లు ఓట్లు వేసిన కానీ ఇప్పుడు పానం బాగలేదు. ఈసారి పోలేను కానీ ఇంటికాడి నుంచే ఓటు వేయొచ్చంటే వేస్తా.