ఖమ్మం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితిని, నిర్లిప్తతను తొలగించి శాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర విద్యాశాఖాధికారులు కేవలం సమీక్షలు, ఆదేశాలతో సరిపుచ్చుతున్నారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖలో నెలకొన్న అయోమయాన్ని తొలగించే సూచనలేవీ కన్పించడం లేదు. విద్యార్థుల విద్యాభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికను సమగ్రంగా రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఆర్భాటపు కసరత్తులు కన్పిస్తున్నాయే తప్ప ఆచరణలో మాత్రం ఏటికేడు విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు, పర్యవేక్షణాధికారులు సహా అన్ని రకాల సిబ్బందికి కేవలం వేసవిలోనే శిక్షణ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ శిక్షణ ద్వారా ఏడాది పొడవునా వారు సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తారని, తద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయని విద్యాశాఖ భావిస్తున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం శిక్షణ నిరంతరం అమలు కావడం లేదు. దీంతో ఫలితాలు నిస్తేజంగా ఉంటున్నాయి.
గత వేసవిలో డీఈవోల నుంచి మొదలుకొని ఎండీఎం సిబ్బంది సహా స్వీపర్ల వరకు అందరికీ శిక్షణ ఇచ్చారు. దీంతో వారంతా ఈ విద్యాసంవత్సరంలో నిరాటంకంగా విద్యాప్రణాళిక అమలుకు అంకితమవుతారని అందరూ భావించారు. కానీ, ఆచరణలో అది విఫలమైంది. ఉపాధ్యాయులకు నిరంతరం ఏదో ఒక పేరుతో శిక్షణలు నిర్వహిస్తూ.. వారిని బడులకు దూరం చేస్తున్నారు. నిరంతర శిక్షణలు విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి శిక్షలుగా మారుతున్నాయి. ఉపాధ్యాయులు సైతం విసుగు చెందుతున్నారు. తగిన సమర్థతతో పనిచేయలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది.
అంతర్జాతీయ ఒప్పందాలు, ఆశయాల సాధనలో భాగంగా సమగ్రశిక్ష పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. కానీ, రాష్ట్రంలో మాత్రం ఈ పథకం గాడి తప్పింది. ఫలితంగా విద్యార్థుల పాలిట సమగ్ర ‘శిక్ష’గా మారింది. సమగ్రశిక్ష పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన సమన్వయకర్తలు కొన్నేళ్లుగా ఏ జిల్లాలోనూ పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఎంపికైనప్పటికీ.. వారం రోజులు గడవకముందే తమను వెనక్కి పంపండంటూ రాష్ట్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడేళ్లు పూర్తయిన తర్వాత కొందరిని, ఐదేళ్లు పూర్తయిన తర్వాత మరికొందరిని మాత్రమే వెనక్కు పంపుతున్నారు. సమన్వయకర్తల నియామకాన్ని రాష్ట్ర అధికారులు అనధికారికంగా జిల్లా బాస్‌లకు కట్టబెట్టారనే వాదన వినిపిస్తున్నది. పైగా, అధికారుల ప్రాపకం పొందిన వారు మాత్రమే సమన్వయకర్తలుగా కొనసాగే స్థితి ఏర్పడింది.
సమగ్రశిక్ష ఒకప్పుడు నిధుల వెల్లువకు చిరునామాగా ఉండేది. దీంతో అక్రమార్కుల అవినీతికి అడ్డులేకుండా పోయేది. ఇటీవల సమగ్రశిక్ష నిధులను పక్కదారి పట్టిస్తుండడంతో కేంద్రం ఇచ్చే నిధులు తగ్గిపోయాయి. అయినప్పటికీ సమగ్రశిక్ష నిధులు పక్కదారి పట్టడంపై అనేక ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఉన్నతస్థాయి అధికారులు సైతం సస్పెన్షన్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం నిఘా పెట్టకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా సమగ్రశిక్షలో సుమారు రూ.2 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టిన విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది.
అయినప్పటికీ అప్పటి బాధ్యులపై కనీసం ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. అంతేగాక ఎఫ్ఏవోతో సహా ఏ ఒక్కరిపైనా చర్యల్లేవు. నిధులు పక్కదారి పట్టిన విషయంపై అప్పటి కలెక్టర్ జోక్యంతో అప్పటి డీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ నిర్వహించినప్పటికీ.. ‘పక్కదారి పట్టిన మొత్తమెంత? ఎక్కడి నుంచి ఎన్ని నిధులు పక్కదారి పట్టాయి?’ అనే విషయాలను గోప్యంగా ఉంచారు. కేవలం జిల్లా సమీక్షలకు సకాలంలో హాజరుకాలేదంటూ చిన్న చిన్న విషయాలపై ఎంఈవోలకు, ఇతర అధికారులకు, సిబ్బందికి వేతనాల కోత విధిస్తున్న జిల్లా అధికారులు.. రూ.కోట్ల నిధులు దారి మళ్లేందుకు కారణమైన వారిపై మాత్రం కంటితుడుపు చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధికి తలమానికంగా భాసిల్లుతుందని భావించిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మంలోని డైట్‌ను సీవోఈగా అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పుడు మాత్రం నిధులు మంజూరైనా సక్రమంగా పనులు జరగడం లేదనే విమర్శలున్నాయి. ఖమ్మం డైట్లో ప్రిన్సిపాల్ సహా అన్ని లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. డైట్ పాలనకు కీలకమైన రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో డైట్ పాత్ర కేవలం పేరుకే పరిమితమైంది.
మండలస్థాయిలో విద్యాశాఖ కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సిన ఎంఈవోల నియామకంలో నిబంధనలకు తిలోదకాలివ్వడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. నిబంధనల ప్రకారం అర్హులకు ఎంఈవో పోస్టులు ఇవ్వకుండా ఉండడం సరికాదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న వారిని అందలమెక్కించడం వంటి ఘటనలూ లేకపోలేదు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని పాఠశాలలకు నిధులు అందిస్తున్న క్రమంలో మంగళవారం మధిరలో ఉన్నతస్థాయి సమీక్ష జరుగనుంది. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి భట్టితోపాటు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, ఖమ్మం కలెక్టర్ అనుదీప్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. విద్యాశాఖ కార్యక్రమాల అమలు గురించి ఇందులో సమీక్షించనున్నారు. మూడు నెలల క్రితం ఖమ్మంలో నిర్వహించిన సమీక్షలో ముఖ్య కార్యదర్శి యోగితా రాణా చేసిన మార్గదర్శకాల అమలుపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది.