ఖమ్మం/ భద్రాచలం/ పర్ణశాల, అక్టోబర్ 13: ‘శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ..’ అనే శమీ శ్లోకం వాడవాడలా మిన్నంటింది. సర్వజనులకు సకల విజయాలు అందించే జగన్మాతను దర్శించిన భక్తజనం పులకించిపోయింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన ముగ్గురమ్మల మూలపుటమ్మను తనివితీరా వీక్షించిన వారంతా ‘జయహో జగన్మాత’ అంటూ కీర్తించారు. శమీ శ్లోకం, జమ్మి చెట్టు, స్వామి అమ్మవార్ల పూజలతో ఉమ్మడి జిల్లా అంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు శనివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని జమ్మిబండ జనసంద్రమైంది. శ్రీరాజరాజేశ్వరదేవి, శ్రీనృసింహస్వామి ఇరువురు ఏకకాలంలో భక్తులకు దర్శనమివ్వడంతో భక్తకోటి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. విజయదశమి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ఇంటిల్లిపాదీ కలిసి దసరా వేడుకల్లో మునిగిపోయారు.
ఆయుధ పూజకు ప్రతీకగా భావించే విజయదశమి రోజున వ్యాపారులు, వాహనదారులు, రైతులతోపాటు సకల జనులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామగ్రామాన ప్రజలందరూ కలిసి జమ్మిచెట్టుకు పూజలు చేశారు. శమీశ్లోకంతోపాటు తమ గోత్రనామాలతో కుటుంబ సభ్యుల పేర్లను, తమ మనసులోని కోరికలను కాగితాలపై రాసి శమీవృక్షానికి వేలాడదీశారు. ఖమ్మంలోని శ్రీస్తంభాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం సహా పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఖమ్మంలోని పారువేట స్థలమైన జమ్మిబండ ప్రాంతం జనసంద్రమైంది. విద్యుత్‌దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందిన జమ్మిబండ.. వేలాదిమంది భక్తులతో కిటకిటలాడింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన జమ్మిబండ వద్ద ఓవైపు శ్రీరాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు, మరోవైపు వేదికపై స్తంభాద్రి గుట్ట శ్రీనృసింహాస్వామి ఉత్సవమూర్తి ఏకకాలంలో దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు. అంతకుముందు స్తంభాద్రి ఆలయం నుంచి మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణాలతో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారిని జమ్మిబండ వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక వేదికపై ఆలయ ప్రధాన అర్చకులు.. స్వామివారిని శాస్ర్తోక్తంగా కొలువుంచి ప్రత్యేక పూజలు చేశారు.