కొత్తగూడెం అర్బన్, జూన్ 24 : జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.124.48 కోట్ల సంయుక్త నిధులతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి కోసం కొత్తగూడెం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఆలోచించి పథకానికి రూపకల్పన చేశామన్నారు. కిన్నెరసాని నుంచి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధితోపాటు ఇతర ప్రాంతాలకు 159 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10 శాతం మున్సిపల్ నిధులు వెచ్చిస్తారన్నారు. పథకంలో భాగంగా ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద 2.65 లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజు శుద్ధి చేసి ఆ నీటిని హైలెవల్ ట్యాంకులకు సరఫరా చేసి అక్కడి నుంచి ఇంటింటికి సరఫరా చేస్తారన్నారు. ఈ పథకానికి ఈ నెల 27న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అలాగే సింగరేణి, కేటీపీఎస్, సీఎస్ఆర్ స్కీం నిధులు సక్రమంగా విడుదలయ్యేలా చూసి పాల్వంచతోపాటు కొత్తగూడెంలోని అన్ని ప్రాంతాలకు రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, దీనిపై అధ్యయనం జరుగుతోందన్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి, సత్యభామ, సత్యావతి, వేముల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.