కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ‘డయాగ్నస్టిక్ సెంటర్’
ప్రజలకు అందుబాటులో 57 రకాల వైద్య పరీక్షలు
రోజుకు 43 ఆసుపత్రుల నుంచి 600 మందికి టెస్టులు
24 గంటల్లోనే ఫలితాలు..
వైద్య చికిత్స ఇప్పటివరకు 55,734 మందికి 1,64,893 టెస్టులు
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది.. ఉదయం బస్తీకి వస్తే తిరిగి ఇంటికి వెళ్లే సరికి సాయంత్రమయ్యేది.. ఇలాంటి అగచాట్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పిం చేందుకు రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రానికో ‘అత్యాధునిక ల్యాబ్’ కేటాయించారు.. దీనిలో భాగంగా కొత్త గూడెంలోని ప్రభుత్వాసుపత్రిలో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటైంది.. ఈ ల్యాబ్‌కు ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా ఉన్న పీహె చ్‌సీలు, అర్బన్ సెంటర్ల నుంచి ‘నమూనాలు’ చేరుకుంటున్నాయి.. వాటిని పరీక్షించి వైద్యసిబ్బంది కేవలం 24 గంట ల్లో ఫలితాలను వెల్లడిస్తున్నారు.. లక్షలాది మంది ప్రజలు ఉచితంగా వైద్యపరీక్షలు చేయించు కుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 16 (నమస్తే తెలంగాణ): జబ్జు చేసి ఆసుపత్రికి వెళ్లే డాక్టర్ కన్సల్టెన్సీ చార్జీ కంటే డయాగ్నస్టిక్ పరీక్షల బిల్లులే జేబులకు చిల్లులు పెడుతుంటాయి. ఇక డాక్టర్‌కు దయలేకుండా టెస్టుల సంఖ్య పెంచితే ల్యాబ్ బిల్లులు చూశాక గుండె దడ రావడం ఖాయం. అసలే జబ్బుతో ఆసుపత్రికి వెళ్తే ఈ పరీక్షల చార్జీలు చూశాక బీసీ, షుగర్ వంటివి వాటంతట అవే పెరుగుతాయంటే అతిశయోక్తి కాదు. జబ్బు నయం కావాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తప్పదు కాబట్టి అప్పు తచ్చునా వైద్యపరీక్షలకు ధారపోయాల్సి వస్తోంది. ఇలా ప్రైవేటు డయాగ్నస్టిక్ ల్యాబుల ఆర్థిక దోపిడీ నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు టీఆర్ఎస్ సర్కారు నడుం బిగించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో అత్యాధునికమైన డయాగ్నస్టిక్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. రెండేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ డయాగ్నస్టిక్ ల్యాబుల్లో 57 రకాల పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల కోసం ఏ ప్రభుత్వ దవాఖానలో నమూనాలు ఇచ్చినా 24 గంటల్లో ఆయా రిపోర్టులు రోగి మొబైల్ ఫోన్‌కు లింక్ ద్వారా చేరుతున్నాయి. రిపోర్టుల బట్వాడా కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో రోగులు రక్త నమూనాలు ఇచ్చినా సమయానుకూలంగా వారికీ తమ రిపోర్టులు చేరుతున్నాయి.
రూ.1.50 కోట్లతో డయాగ్నస్టిక్ సెంటర్..
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1.50 కోట్లతో అత్యాధునికమైన మెషినరీతో డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్న 43 పీహెచ్‌సీల పరిధిలో రోగుల రక్త పరీక్షలను ఈ సెంటర్ ద్వారా చేస్తున్నారు. థైరాయిడ్ టెస్టుతోపాటు సీబీపీ, లివర్, బీపీ, షుగర్, బ్లడ్‌కౌంట్, ఆల్ టెస్టులు, డెంగీ, మలేరియా, పైలేరియా, టీబీ, గుండె తదితర పరీక్షలన్నీ ఇక్కడే ఈ ల్యాబ్‌లోనే ఉచితంగా చేస్తున్నారు. ల్యాబ్‌లో సిబ్బంది, టెక్నీషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ల్యాబ్ పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని కూడా నియమించారు.
రోగులకు తగ్గిన ఆర్థిక భారం..
పరీక్షల పేరిట ఇప్పటికే జేబులు గుల్ల చేసుకుంటున్న రోగులకు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ పెద్ద దిక్కైంది. ఇంతకుముందు ప్రైవేటు ల్యాబుల వద్ద ఎవరి చేతిలో చూసినా రక్త పరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్ రిపోర్టులే కనిపించేవి. గడిచిన మూడు నెలలుగా అవి పెద్దగా కనిపించడం లేదు. ప్రైవేటు టెస్టింగ్ సెంటర్ల వద్ద తగ్గిన తాకిడి పీహెచ్‌సీల పెరిగింది.
1,64,893 మందికి పరీక్షలు..
రెండేళ్ల క్రితం ప్రారంభించిన డయాగ్నస్టిక్ సెంటర్లో ఇప్పటి వరకు 55,734 మంది రోగులకు 1,64,893 పరీక్షలు చేశారు. దీని వల్ల థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేయించుకునే రోగికి ప్రతి నెలా సుమారు రూ.20 వేలు, సాధారణ రోగులకు రూ.5 వేల వరకూ ఆదా అవుతున్నట్లు లెక్క. ఇదే పరీక్షలు ప్రైవేటు ల్యాబుల్లో చేయిస్తే భారీ మొత్తంలోనే వెచ్చించాల్సి వచ్చేది.
అన్ని పరీక్షలూ చేస్తున్నాం..
ప్రైవేటు ల్యాబుల్లో చేసే ప్రతి పరీక్షనూ మేం ఇక్కడ చేస్తున్నాం. అన్ని పరీక్షలూ ఉచితమే. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చే టెస్టింగ్‌లను కూడా వెంటనే చేసి పంపిస్తున్నాం. అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల పరీక్షలను వెంటనే చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యం వల్ల ఆర్థికంగా రోగులకు చాలా ఊరట. ఖరీదైన పరీక్షలు కూడా పూర్తిగా ఉచితం.
– సురేఖ, ల్యాబ్ మేనేజర్
43 ఆసుపత్రుల నుంచి నమూనాలు..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ల పేద రోగులకు ఎంతో మేలు జరుగుతోంది. వైద్యానికి అయ్యే వ్యయం కంటే ల్యాబ్ టెస్టులకే అయ్యే ఖర్చే ఎక్కువ. ఈ ల్యాబ్ వచ్చాక పేద రోగులకు ఆర్థిక భారం తగ్గింది. జిల్లాలో 43 ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి నమూనాలు తీసుకుంటున్నాం. అన్ని నమూనాలు ఇక్కడే వస్తాయి. నమూనాలు, రిపోర్టుల బట్వాడా కోసం ఆరు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం.
– డాక్టర్ చేతన్, డయాగ్నస్టిక్ సెంటర్ నోడల్ అధికారి