మధిర, జులై 11 : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి మాట్లాడుతూ.. అనర్హులను అర్హులుగా ఎంపిక చేసే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలను నమ్మించి ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తమ పార్టీలోకి వస్తే ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు అర్హులను అనర్హులుగా, అనర్హులను అర్హులుగా తారుమారు చేస్తున్నారని తెలిపారు.
ప్రజా పాలన పేరుతో పాలన సాగిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణతో ప్రజాపాలన కాస్త అవినీతి పాలనగా రూపాంతరం చెందిందన్నారు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, మండల నాయకులు ఓట్ల శంకర్రావు, గౌరరాజు ధనలక్ష్మి, బాజినేని వెంకట నరసయ్య, వాడిత్య లాలు, అంగడాల అమరయ్య నాయుడు, శ్రీరాములు, మిరియాల నాగేశ్వర్రావు, వడ్డాణపు మధు, ఎలిజాల గోపినాథ్, వజ్రమ్మ, మదర్, బి.ధనలక్ష్మి పాల్గొన్నారు.